Lok Sabha Ex-Speaker: నేను బతికే ఉన్నాను బాబోయ్

Lok Sabha Ex-Speaker బీజేపీ సీనియర్ మహిళా నేత, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఆమె చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూరే ఈ విషయాన్ని ట్విట్టర్ లో పేర్కొనటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎట్టకేలకు అసలు విషయం తెలుసుకొని ఆయన తన ట్వీట్ ని డిలీట్ చేసి మరో రెండు ట్వీట్లు పెట్టారు. సుమిత్రా మహాజన్ కుటుంబానికి క్షమాణ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అసలు మనం విన్నది నిజమా కాదా అని మాట వరసకైనా అడక్కుండానే ఫేక్ న్యూస్ ని వ్యాప్తిచేయటం పట్ల సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనకా ముందూ ఆలోచించకుండా, కనీసం అధికారులను సంప్రదించి ధ్రువీకరించుకోకుండా తప్పుడు ప్రచారం చేయటాన్ని ఖండించారు.

నిన్న రాత్రి నుంచే..

నిన్న గురువారం రాత్రి నుంచి మొదలైన ఈ దుష్ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఖండించారు. సుమిత్రా మహాజన్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమెకు ఏమీ కాలేదని స్పష్టం చేశారు. దీంతో అప్పటివరకు అత్యుత్సాహం ప్రదర్శించి నెటిజన్లు నాలుక్కరుచుకున్నారు. సుమిత్రా మహాజన్ కూడా ఒక ఆడియోని విడుదల చేశారు. దాన్ని ఆమె కుమారుడు మందార్ తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు. ‘‘నేను బతికే ఉన్నాను. కానీ.. చనిపోయాననే తప్పుడు వార్త దేశమంతా పాకిపోయింది. మా బంధువులు ఆందోళన చెందారు. ఫోన్ చేసి అడిగారు. దీంతో నా తమ్ముడి బిడ్డ శశిథరూర్ ని సోషల్ మీడియాలో నిలదీసింది’’ అని సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు.

తప్పైంది.. క్షమించండి..

‘సుమిత్రా మహాజన్ గురించి నాకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావటంతో నిజనేనని నమ్మాను తప్ప ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అని శశిథరూర్ పశ్చాత్తాపం వెలిబుచ్చారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారంటే నాకు అంతకుమించి ఏం కావాలా అంటూ హర్షం వ్యక్తం చేశారు. సుమిత్రా మహాజన్ కుమారుడితో మాట్లాడి జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పారని తెలిపారు. దేవుడి దయ వల్ల మందార్ నన్ను అర్థం చేసుకున్నాడని అన్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికైన సుమిత్రా మహాజన్ 2014 జూన్ నుంచి 2019 జూన్ వరకు (ఐదేళ్ల పాటు) లోక్ సభ కి (రెండో మహిళా) స్పీకర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం పాలిటిక్స్ నుంచి రిటైర్డ్ అయ్యారు.

Advertisement