నా కోడిది హ‌త్యే, నిందితుడిని క‌నిపెట్టాలంటూ మాజీ ఎమ్మేల్యే కుమారుడు ఫిర్యాదు

కొన్ని సంఘ‌ట‌న‌లు చాలా విచిత్రంగా ఉంటాయి. కోడి, పిల్లి, చ‌నిపోయాయ‌ని పోలీసుల‌కి ఫిర్యాదు చేయడం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. తాజాగా కోడిని హ‌త్య చేశారంటూ ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కోడికి పోస్ట్ మార్టం చేసి చంపిన వారిని అరెస్ట్ చేయాల‌ని కూడా విజ్ఞ‌ప్తి చేశాడు.

కోడికి పోస్ట్ మార్టం చేయాల‌ని మాజీ ఎమ్మేల్యే కుమారుడు కోర‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. వివార‌ల‌లోకి వెళితే యూపీ మహారాజ్‌గంజ్‌ జిల్లా పిప్రకల్యాణ్‌ గ్రామానికి చెందిన దుఖీ ప్రసాద్‌ మాజీ ఎమ్మెల్యే. ఆయన కుమారుడు రాజ్‌కుమార్‌ భారతి. రాజ్ కుమార్‌కి ప‌క్షులు ఎంటే చాలా ప్రాణం.

ఎన్నో ప‌క్షుల‌ని పెంచి పోషిస్తున్నాడు రాజ్ కుమార్. ఇందులో భాగంగానే కోడిని కూడా పెంచుతున్నాడు. అయితే ఆ కోడి ఆక‌స్మాత్తుగా మృతి చెందింది. దీనిపై అనుమానం వ్య‌క్తం చేసిన రాజ్ కుమార్ తన కోడికి ఎవరో విషం పెట్టి చంపేశారని సింధూరియన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. కేసు పెట్టి దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కోడికి పోస్టుమార్టం చేయాలని విజ్ఞప్తి చేశాడు.

నిందితుల‌ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయ‌న డిమాండ్ చేశాడు. కేసు దాఖ‌లు చేసిన త‌ర్వాత రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తన దగ్గర చిలుకలు, పావురాలు, కోళ్లు ఎన్నో ఉన్నాయని, వాటిని ప్రేమగా పెంచిపోషిస్తున్నట్లు తెలిపాడు. తనను గిట్టని వారు ఉద్దేశపూర్వకంగా కోడికి విషయం పెట్టి చంపేశారు అని ఆరోపించాడు.