Flipkart : నాణ్యత లేని వస్తువులు అమ్మిన ఫ్లిప్ కార్ట్..సీసీపీఏ ఆగ్రహం
NQ Staff - August 18, 2022 / 06:12 PM IST

Flipkart : ఈ రోజుల్లో చాలా మంది ఆన్‌లైన్ కొనుగోలుకి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లోనే విక్రయాలు సాగిస్తున్నారు. అయితే ఇటీవల ఫ్లిప్ కార్ట్‌లో నాణ్యత లేని వస్తువులు విక్రయించడానికి అనుమతించినందుకు గాను సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ.లక్ష జరిమానా విధించింది.
జరిమానా..
నాణ్యతలేని వస్తువులను విక్రయించడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సిందిగా ఫ్లిప్ కార్ట్ ను ఆదేశించింది. నాణ్యత లేని కుక్కర్లకు సంబంధించి నమోదైన ఒక ఫిర్యాదుపై విచారణ జరిపి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వివరాలను సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే వెల్లడించారు.

Flipkart Sold Substandard Goods
తమ ప్లాట్ ఫాంపై వినియోగదారులకు విక్రయించిన నాణ్యత లేని 598 కుక్కర్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీసీపీఏ ఆదేశించింది. దీనికి సంబంధించి వెంటనే వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని.. ఆ కుక్కర్లకు సంబంధించిన పూర్తి సొమ్మును రీఫండ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలపై 45 రోజుల్లోగా కంప్లియన్స్ రిపోర్టును తమకు సమర్పించాలని ఆదేశించింది.
సీసీపీఏ ప్రకారం, ఫ్లిప్‌కార్ట్ తన ’వినియోగ నిబంధనల’లో ప్రెజర్ కుక్కర్‌లకు సంబంధించి ప్రతి ఇన్‌వాయిస్‌పై ’ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆధారితం’ అని పేర్కొంది. వివిధ పంపిణీ ప్రయోజనాల కోసం విక్రేతలను ’బంగారం, వెండి, కాంస్య’గా గుర్తించింది. అమ్మకాల విషయంలో ఫ్లిప్‌కార్ట్ పోషించిన పాత్రను ఇది సూచిస్తుంది. తన ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఇటువంటి ప్రెజర్ కుక్కర్‌లను విక్రయించడం ద్వారా రూ. 1,84,263 ఫీజును సంపాదించినట్లు ఫ్లిప్‌కార్ట్ అంగీకరించింది.