Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ తర్వాత మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా, బన్నీని చూసేందుకు అభిమానులు బారులు తీరారు. రంపచోడవరం జంక్షన్ వద్దకు భారీగా చేరుకొని సెల్‌ఫోన్ లైట్స్‌తో బన్నీని స్వాగతించారు. ఇది చూసిన బన్నీ కూడా తెగ సంతోషించారు. తనకోసం వేచి చూస్తున్న అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. అయితే అక్కడ తీసిన ఓ ఫోటోని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన బన్నీ ‘థాంక్ యు రంపచోడవరం’ అని క్యాప్షన్ పెట్టారు.
ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత సుకుమార్– అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ గత నెల రోజులుగా రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి ఆటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ మంగళవారం పూర్తయినట్టు సమాచారం. తర్వాతి షెడ్యూల్ కోసం టీం కేరళ వెళ్లనుంది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ‘పుష్ప’ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లావ్ క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రంతో ప్రేక్షకులని అలరించిన అల్లు అర్జున్ ఈ ఏడాది ఆగస్ట్ 13న పుష్ప సినిమాతో పలకరించనున్నాడు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్‌కు సంబంధించిన లుక్స్ ఇప్పటికే విడుదల కాగా, ఇవి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని తెగ ఎదురు చూస్తున్నారు.
Fans gathering at Rampachodavaram junction today…Mass🔥🔥🔥@alluarjun#PUSHPA #AA #alluarjun #aaarmy pic.twitter.com/QGWotfSipJ
— Eluru Sreenu (@IamEluruSreenu) February 2, 2021