JR NTR: ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి అడ్డంకులు.. మ‌రింత లేట్ అయ్యే ఛాన్స్ ..!

బుల్లితెర కార్య‌క్ర‌మాల‌ను హోస్ట్ చేసేందుకు స్టార్ హీరోలంద‌రు చాలా ఆసక్తి చూపుతున్నారు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు షోతో నాగార్జున‌, చిరంజీవి వంటి వారు బుల్లితెర‌కు ఎంట్రీ ఇవ్వ‌గా బిగ్ బాస్ షోతో జూనియ‌ర్ ఎన్టీఆర్,నాని, నాగార్జున సందడి చేశారు. ఇక నెం 1 యారి అనే కార్య‌క్ర‌మంతో రానా సంద‌డి చేశారు. అయితే బిగ్ బాస్ షో త‌ర్వాత బుల్లితెర వైపు చూడ‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షోతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కార్యక్ర‌మాన్ని ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు పేరుతో జెమినీ టీవీ స‌రికొత్త కార్య‌క్ర‌మాన్ని రూపొందించి ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది.

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్యక్ర‌మానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ కాగా, ఇందుకు సంబంధించి ప్రోమోల‌ను త్రివిక్ర‌మ్ షూట్ చేశారు. ఇప్ప‌టికే ప‌లు ప్రోమోలు విడుద‌ల కాగా, ఇవి షోపై మ‌రింత ఆస‌క్తిని పెంచాయి. ఏప్రిల్ నుండి షోను ప్ర‌సారం చేయాల‌ని ఛానెల్ నిర్వాహ‌కులు భావించ‌గా, ఇప్పుడు అనివార్య కారణాలతో ఈ షోను జులైకి వాయిదా వేసారని తెలుస్తుంది. కరోనా కారణంగా కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్ కూడా లేట్ అవుతుందట‌. దీంతో జూలై నుండి షోను మొద‌లు పెట్టాల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చార‌ట నిర్వాహ‌కులు, అస‌లు గ‌త ఏడాదే ఈ షోని ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది.

వెండితెర‌పైన రికార్డులు సృష్టిస్తున్న ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో బుల్లితెర‌పై కూడా సంచ‌న‌లనం సృష్టించాడు. ఇక ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంతో ఎలాంటి అంచ‌నాలు సృష్టిస్తాడా అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షోలో ఎంటర్‌టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండటంతో అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. మ‌రోవైపు జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబ‌ర్ 13న చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డుతుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్.. త్రివిక్ర‌మ్, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

Advertisement