Etela Rajender: ఈటలకు టీఆర్ఎస్ నుంచి ఫస్ట్ కౌంటర్
Kondala Rao - May 4, 2021 / 05:09 PM IST

Etela Rajender తాజా మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఈటల రాజేందర్ కి అదే పార్టీ నుంచి ఫస్ట్ కౌంటర్ పడింది. అధికార పార్టీ తరఫున ఆయనకు వ్యతిరేకంగా గత మూడు నాలుగు రోజుల నుంచి ఎవరూ మాట్లాడలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఇదే విషయమై విలేకరులు ప్రశ్నిస్తే ఆ అంశం ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిధిలో ఉందని చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇవాళ మంగళవారం మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ నేరుగా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసు తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈటల చేసిన కొన్ని విమర్శలకు సమాధానం చెప్పారు. అదే సందర్భంలో ఆయన లేవనెత్తిన పలు అంశాలకు కొప్పుల వివరణ ఇవ్వలేదు.
అన్నీ అబద్ధాలే..
పార్టీలో తనకు సరైన గౌరవం, విలువ దక్కలేదంటూ ఈటల చెప్పినవన్నీ అబద్ధాలేనని కొప్పుల స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లో తొలి నుంచీ ఆయనకు తగిన ప్రాధాన్యమే దక్కిందని చెప్పారు. 2004లో కమలాపూర్ నియోజకవర్గంలో 23 మంది పార్టీ నేతలను కాదని ఈటలకు టికెట్ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక శాసనసభాపక్ష నేతగా ఛాన్స్ దక్కిందని, మొదటి కేబినెట్ లో ముఖ్య శాఖల(ఆర్థిక, పౌర సంబంధాల)కు మంత్రి అని వివరించారు. ఇంత చేసినా ఈటల ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ప్రభుత్వ పథకాలకి వ్యతిరేకంగా మాట్లాడేవారని, అయినా పార్టీ ఎప్పుడూ సీరియస్ గా స్పందించలేదని కొప్పుల గుర్తుచేశారు.
అది తప్పుకాదా?..
‘‘అసైన్డ్ భూములను అమ్మకూడదని, కొనకూడదని అందరికీ తెలుసు. అయినా ఈటల కొన్నారు. అది తప్పు కాదా?. ఎకరం కోటిన్నర రూపాయల విలువ చేసే భూమిని రూ.6 లక్షలకే ఎలా కొనుగోలు చేశారు. తద్వారా ఆయన ఎస్సీలకు లాభం చేసినట్లా? నష్టం చేసినట్లా?. బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే సమాధానం చెప్పాల్సిందిపోయి సర్కారు పైన, సీఎం పైన మాటల దాడి చేయటం ఎంత వరకు కరెక్ట్?. వీటన్నింటికీ ఈటల జవాబు చెప్పాలి’’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. అయితే.. అసైన్డ్ భూములను తాను కొనలేదని, ఆ ఇష్యూ ఇంకా ఎమ్మార్వో దగ్గరే పెండింగులో ఉన్నట్లు ఈటల చెప్పిన సమాధానానికి కొప్పుల ఈశ్వర్ వివరణ ఇవ్వలేదు. అంతేకాదు. ఆ భూముల్ని కొనబోతున్న సంగతిని తాను సీఎం కేసీఆర్ కి, సీఎం ఆఫీసు అధికారి నర్సింగ్ రావుకి చెప్పానన్న ఈటల జవాబు పైన కొప్పుల స్పందించలేదు.