Etela Rajender: ఈటల చుట్టూ.. మరింతగా బిగుస్తున్న ఉచ్చు..

Etela Rajender తాజా మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అసైన్డ్ భూములను, అటవీ భూములను ఆక్రమించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయనపై లేటెస్టుగా దాదాపు 1,561 ఎకరాల ఆలయ భూముల కబ్జా వ్యవహారం కూడా వెలుగు చూసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం పైనా దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సోమవారం ఒక కమిటీని నియమించింది. ఇందులో ఏకంగా నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు అందునా ముగ్గురు జిల్లా కలెక్టర్లు ఉండటం గమనార్హం. ఈటల రాజేందర్, ఆయన అనుచరులు, బినామీలు హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్ పేట మండలం దేవరయాంజాల్ లోని శ్రీ సీతారామస్వామి ఆలయ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పందించిన సర్కారు.. పైన పేర్కొన్న చర్యకు ఉపక్రమించింది. దేవరయాంజాల్ ప్రాంతం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోకి వస్తుంది.

ఎవరా సభ్యులు?..

ఈటల పై వచ్చిన ఆలయ భూముల కబ్జా కంప్లైంట్లపై విచారణకు నియమించిన కమిటీలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టర్ స్వేతా మహంతి, మంచిర్యాల్ కలెక్టర్ భారతి హోళికేరి, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉన్నారు. ఆయా భూముల్లో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు కూడా వెలిశాయని అంటున్నారు. ఆ ల్యాండ్స్ విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. కాగా ఈ భూముల కబ్జా వెనక ఎవరెవరు పెద్ద మనుషులు ఉన్నారో గుర్తించాలని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది.

చర్యలేం తీసుకోవాలో కూడా చెప్పండి..

దేవరయాంజాల్ ఆలయ భూముల ఆక్రమణ వ్యవహారంలో బాధ్యులను గుర్తించటంతోపాటు వాళ్లపై తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించాలని ప్రభుత్వం.. విచారణ కమిటీని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భక్తుల, దాతల మనోభావాలను దెబ్బతీస్తూ ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోందని సీఎస్ పేర్కొన్నారు. ఆ భూములకు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పూర్తి వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement