Etela Rajender : తెలంగాణలో ఈటల రాజేందర్ కొత్త పార్టీ?.. పెదవి విప్పిన ఈటల

Etela Rajender :  ప్రస్తుతం తెలంగాణలో ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం, మంత్రి వర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయడం గురించే చర్చ. గత మూడు రోజుల నుంచి వరుసగా… ఏ మీడియాలో చూసినా.. ఈటల గురించే చర్చ.. ఆయన గురించే కథనాలు. మెదక్ జిల్లా అచ్చంపేటలో ఈటల రాజేందర్ 100 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని.. అక్కడి స్థానిక రైతులు కొందరు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. దీంతో సీఎం కేసీఆర్ వెంటనే చర్యలకు ఉపక్రమించారు. ఈటలపై వెంటనే విచారణకు ఆదేశించారు. అక్కడి నుంచి మొదలు.. నిన్నటి వరకు ఈటలకు ఉన్న పవర్స్ అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. చివరకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.

etela rajender gives clarity about his new party
etela rajender gives clarity about his new party

ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించడంతో… ఇక ఈటల టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి.. కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దానిపై ఆయన తాజాగా స్పందించారు. తానేమీ కొత్త పార్టీ పెట్టడం లేదని.. అసలు అటువంటి ఆలోచనే లేదన్నారు. అయితే.. తన రాజకీయ భవిష్యత్తు గురించి తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని రాజేందర్ స్పష్టం చేశారు.

గత మూడు రోజుల నుంచి నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం నా శాయశక్తుల కృషి చేశాను. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేశాను. ఏనాడూ పార్టీకి నష్టం కలిగించలేదు. సీఎం కేసీఆర్ తో నాకు చాలా అనుబంధం ఉంది. ఆయనతో సుధీర్ఘ కాలం పాటు పనిచేశా. 2008లో కేసీఆర్ ఆదేశించడంతో… రాజీనామా కూడా చేశా. పార్టీ భీఫామ్స్ ఉన్నంత మాత్రాన గెలుపు రాదు. ప్రజల ఆమోదం ఖచ్చితంగా ఉండాలి.. అని ఈటల అన్నారు.

ఇక తనపై మోపిన భూకబ్జా వ్యవహారంపై ఈటల స్పందిస్తూ… నాలాంటి సామాన్యుడిపై కేసీఆర్ తన అధికారాన్ని ఉపయోగించారు. నేను వేల కోట్లు సంపాదించానా. నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు సంబంధం లేని భూముల్లో సర్వే చేసి… నాపై వచ్చిన ఆరోపణలకు కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. అధికారులు సమర్పించిన నివేదిక అంతా తప్పుల తడక. నావి కాని భూములు నావి అంటూ నాపై నిందలు వేస్తున్నారు. నేను అరెస్టులకు, కేసులకు భయపడను. నన్ను చంపడానికి నయీం గ్యాంగే రెక్కీ నిర్వహించింది. అప్పుడే నేను భయపడలేదు. ఇప్పుడెందుకు భయపడతా? అంటూ ఈటల రాజేందర్ మండిపడ్డారు.

Advertisement