Telangana: కేంద్రం తీరును తప్పుపట్టిన మరో తెలంగాణ మంత్రి

Telangana ఇవాళ గురువారం ఒకే రోజు ఇద్దరు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కరోనా వైరస్ ట్రీట్మెంట్ లో ఉపయోగించే కొవిషీల్డ్ టీకాకు రెండు రేట్లు నిర్ణయించటం సరికాదంటూ ఈరోజు ఉదయమే మంత్రి కేటీఆర్ విమర్శించగా మధ్యాహ్నం మరో మంత్రి ఈటల రాజేందర్ రెమిడెసివిర్ వ్యాక్సిన్ కేటాయింపు విషయంలో మోడీ సర్కారు వ్యవహరించిన విధానాన్ని ఖండించారు. తెలంగాణ రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిషా సొంత రాష్ట్రమైన గుజరాత్ కి ఎంత టీకా ఇచ్చారో తెలంగాణకు ఎంత ఇచ్చారో స్పష్టం చేయాలంటూ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

4 లక్షలు అడిగితే..

తెలంగాణ రాష్ట్రానికి 4 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు కావాలంటూ ఆర్డర్ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పటం పట్ల ఈటల రాజేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసన తెలియజేశారు. తెలంగాణలో ఉత్పత్తి చేసే రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఈ రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. రెమిడెసివిర్ ని కూడా కేంద్రం తమ కంట్రోల్ లో ఉంచుకోవటం సరికాదని, బాధాకరమని ఈటల ఆవేదన వెలిబుచ్చారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో మాట్లాడానని పేర్కొన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర పేషెంట్లు మాత్రమే కొవిడ్-19కి చికిత్స పొందట్లేదని, చుట్టుపక్కల రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ రోగులు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఈటల వివరించారు.

ఆక్సీజన్ కూడా..

తెలంగాణ రాష్ట్రంలో నిత్యం 384 టన్నుల ఆక్సీజన్ అవసరమని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఇప్పుడు రోజుకి 260 టన్నుల నుంచి 270 టన్నుల వరకు ఆక్సీజన్ వస్తోందని, ప్రస్తుతానికైతే కొరత లేదని తెలిపారు. ఒకవేళ ఆక్సీజన్ కి గనక షార్టేజీ ఏర్పడితే దానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. తమిళనాడు నుంచి 30 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ కేటాయించినా ఆ రాష్ట్రం మాత్రం ఒక్క టన్ను కూడా ఇవ్వబోమని మొండికేస్తున్నట్లు పేర్కొన్నారు. మేం కూడా తమిళనాడు మాదిరిగానే వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement