సరిగ్గా 48 గంటల్లో ఎలక్షన్ అనగా .. అనకూడని మాట అని ఇరుక్కున్న కే‌సి‌ఆర్ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎల్బీ స్టేడియంలో బహిరంగ మహాసభ నిర్వహించారు. ఎప్పటి లాగానే తనకు ప్రత్యర్థులైన పార్టీలను ఏకి పారేస్తారు అని అందరూ అనుకున్నారు కానీ ఈసారి కేసీఆర్ ఎందుకో తమ పార్టీని డిఫెన్స్ చేసుకుంటూ మాట్లాడారు. బహుశా ప్రజల్లో తన పాలనా పై వ్యతిరేకతను బాగా వచ్చిందని.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చేదు ఫలితాలే వస్తాయని ముందుగానే కేసీఆర్ ఊహించారు ఏమో కానీ నిన్నటి ప్రసంగంలో దూకుడు స్వభావం పెద్దగా కనిపించలేదు. టీఆర్ఎస్ మగతనం ఉన్న పార్టీ అని ఒక సంచలన వ్యాఖ్య చేశారు తప్పించి గతంలో లాగా ప్రతిపక్ష పార్టీ ల పై విరుచుకుపడలేదు. ఆయన చేసిన ప్రసంగం లో ప్రస్తావించిన విషయాలను కేటీఆర్ కూడా చెప్పగలరని రాజకీయ పండితులు చెబుతున్నారు.

 

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలంతా కలిసి హైదరాబాద్ కి తరలి వస్తున్నారు. బీజేపీ పార్టీ కి ఇవి జాతీయ ఎన్నికలా లేక మున్సిపల్ ఎన్నికలా? ఒక బక్క కేసీఆర్ ని కొట్టడానికి ఇంత మంది తరలి వస్తారా? హైదరాబాద్ లో వర్షాలు వచ్చినప్పుడు వరదల్లో మునిగిపోయాం సహాయం చేయండి అని రూ. 1350 కోట్లు అడిగితే కేంద్రం 13 పైసలు కూడా ఇవ్వలేదు. వరద బాధితులు ధర్నాలు చేయకపోయినా, డబ్బు అడగకపోయినా మేము అంతట మేమే చొరవ తీసుకొని తక్షణ సాయంగా పదివేలు ఇవ్వడం ప్రారంభించాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఇంకా బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా వరదలు వచ్చిన డబ్బులు ఇవ్వలేదు కానీ.. ఇక్కడ మేం ఇస్తే మాత్రం కిరికిరి పెడుతున్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వనట్టుగా రూ. 650 కోట్లు ఇచ్చాము’ అని అన్నారు.

కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ.. ఢిల్లీకి పోయి రాజకీయాల్లో రాణిస్తానని భయపడిపోతున్న బీజేపీ పార్టీ తనని తెలంగాణలోనే ఆపేయాలని కంకణం కట్టుకుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలావరకు నీటి సమస్యను పరిష్కరించామని.. ఇంకా పరిష్కరించాల్సిన నీటి సమస్యలు కొన్ని మాత్రమే ఉన్నాయని.. వాటిని కూడా అతి త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్ చెప్పారు. ఛాలెంజ్ చేసి, తొడగొట్టి మరీ మిషన్ భగీరథ పూర్తి చేశామని… టీఆర్ఎస్ మగతనం ఉన్న పార్టీ అని అన్నారు.

Advertisement