Mirabai: మీరాబాయి విజ‌యం వెనుక తెలుగోడి కృషి కూడా ఉంది..!

Mirabai: మీరాబాయి చాను ఈ పేరు గ‌త కొద్ది రోజులుగా మారుమ్రోగిపోతుంది. వెయిట్ లిఫ్టింగ్ లో మణిపూర్ కు చెందిన మీరాబాయ్ చాను ఒలింపిక్స్ లో ర‌జ‌త‌ పతకం సాధించి.. యావత్ భారత జాతి గర్వపడేలా చేసింది . మణిపూర్ కు చెందిన ఆమే అయినా.. ఆ విజయం వెనుక మన బెజవాడ వాసి ఉన్నారు. ఈ విష‌యం తెలుసుకున్న‌మ‌న తెలుగోళ్లు ఫుల్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు.

ఒక‌ప్పుడు కుటుంబం క‌డుపు నింప‌డానికి క‌ట్టెలు మోసింది. ఇప్పుడు 140 కోట్ల ప్ర‌జ‌ల ఆశ‌ల భారాన్ని మోస్తూ ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చింది. దీంతో ఆమెకు ప్రశంసలే కాకుండా నగదు బహుమతులు కూడా అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే రైల్వే శాఖ రూ. 2 కోట్లు, మ‌ణిపూర్ ప్రభుత్వం కోటి రూపాయల నజరాన ప్రకటించాయి. ఇక ప్రైవేటు కంపెనీలు సైతం మీరబాయి ప్రతిభకు పట్టం పడుతున్నాయి.

అయితే మీరాబాయ్ మ‌న‌దేశానికి ప‌త‌కంసాధించ‌డం వెనుక తెలుగోడి కృషి ఉంది. విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్‌లో రిజ‌ర్వేష‌న్ సూప‌ర్ వైజ‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న కోటేశ్వ‌ర‌రావు స్వ‌త‌హాగా వెయిట్ లిఫ్ట‌ర్. 2006లో స్పోర్ట్స్ కోటాలో అత‌నికి ఉద్యోగం వ‌చ్చింది.జాతీయ, ఆలిండియా రైల్వే వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు కైవసం చేసుకున్నాడు.

కండ‌రాల స‌డ‌లింపు కోసం కోటేశ్వ‌ర‌రావు ఫిజియోథెరఫిస్ట్‌ శ్రీహరి వద్ద మసాజ్‌ చేయడం నేర్చుకున్నాడు. 2016,2017 సంవ‌త్స‌రంలో ముంబైలో జ‌రిగిన భారత రైల్వే వెయిట్‌ లిఫ్టింగ్‌ జట్టు శిక్షణ శిబిరంలో.. ఫిజియోగా, మసాజర్‌గా వ్యవహరించాడు. ఇండియన్‌ రైల్వేస్‌ జట్టు కోచ్‌, ప్రస్తుత భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ జట్టు చీఫ్‌ కోచ్‌, ద్రోణాచార్య అవార్డీ విజయ శర్మ దృష్టిని ఆకట్టుకున్నాడు.

భార‌త వెయిట్ లిఫ్టింగ్ జ‌ట్టుకు కోటేశ్వ‌ర‌రావుని మ‌సాజర్‌గా నియ‌మిస్తూ ఇండియన్‌ రైల్వే స్పోర్ట్స్‌ బోర్డు నుంచి ఆదేశాలు అందాయి. 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత లిఫ్టర్లకు మసాజర్‌గా నియమితులయ్యాడు. ఈ పోటీలో భార‌త్ ఐదు ప‌సిడి, రెండు ర‌జ‌త‌, ఒక కాంస్య ప‌త‌కం సాధించింది. ఈ పతకాలు సాధించిన వారిలో మీరాబాయి ఛాను, సతీష్‌ శివలింగం, రాగాల రాహుల్‌, వికాస్‌ ఠాగూర్‌, ప్రదీప్‌ సింగ్‌, లాతూర్‌, గురు రాజ, సంజితా ఛాను, పూనమ్‌ యాదవ్‌ వంటి వారు ఉన్నారు.

వారు సాధించిన ఈ ప‌తకాల వెన‌క కోటేశ్వ‌ర‌రావు కృషి కూడా ఉంద‌ని భావించిన విజయ శ ర్మ ..కోటేశ్వరరావును ప్రతి అంతర్జాతీయ టోర్నీకి లిఫ్టర్లకు సపోర్టర్‌గా, మసాజర్‌గా తీసుకెళ్లేవారు. 2018లో మీరాబాయి ఛాను కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి పతకం కైవసం చేసుకుంది. అప్పటి నుంచి మీరా.. కోటేశ్వరరావును అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచేది. కోటేశ్వరరావు స్వతహాగా లిఫ్టర్‌ కావడంతో మీరా ప్రాక్టీసు సమయంలో కూడా దగ్గరుండి వెయిట్స్‌ లోడ్‌ చేయడం, అన్‌ లోడ్‌ చేయడం వంటివి కూడా చూసుకునేవాడు.

ప్రాక్టీస్ ముగిసాక ఆమె దేహాన్ని రిలాక్స్ చేసేవాడు. తినే ఆహార విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకునేవాడు. డోపింగ్ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు అవ‌స‌ర‌మైన ఆహారాన్ని అందించేవాడు. చాను ఆహార విష‌యంలో కోటేశ్వ‌ర‌రావు త‌ప్ప‌క శ్ర‌ద్ధ పాటించేవాడు. మీరాకు సాల్మన్‌ ఫిష్‌ అంటే బాగా ఇష్టమని.. దక్షిణాది వంటకాలు, మాంసాహారం వండిపెట్టాను అన్నారు కోటేశ్వర్రావు. ఇలా ఆమెకు మసాజర్‌గా విధులు నిర్వర్తిస్తూ, ఆటలో సహాయకునిగా, ప్రత్యేక పోషకాహారాన్ని అందించే సమయంలో వంటవానిగా.. ఇలా అన్ని విధాలుగా తన పూర్తి సహకారాన్ని అందించాడు కందుకూరి వీర కోటేశ్వరరావు.