Eatala: అటు ఈటల.. ఇటు ఆయన భార్య..

Eatala: ఈటల రాజేందర్ కుటుంబం ఈరోజు ఆదివారం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఆయన మరికొద్దిసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. ఈటల సతీమణి జమున ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మీడియా సమావేశం పెట్టి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారనే వార్తల నేపథ్యంలో ఆయన హస్తినకు పయనం కావటం గమనార్హం. అదే ధైర్యంతో అన్నట్లుగా ఆయన భార్య తొలిసారి తెర మీదికి వచ్చి రాష్ట్ర ప్రజలకు తన వాదన వినిపించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈటల రేపు సోమవారం ఉదయం కమలం పార్టీ పెద్దలను కలుస్తారని, తద్వారా తన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇటు ఆయన జీవన సహచరి తెలంగాణ రాజకీయ గత చరిత్రను, కేసీఆర్ వ్యవహార శైలిని గుర్తు చేయటం చెప్పుకోదగ్గ విషయం.

eatala Rajender

ఎవరెవరిని కలుస్తారు?..

ఈటల రాజేందర్ ఢిల్లీలో కాషాయం పార్టీ హైకమాండ్ అమిత్ షాతో, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ తో భేటీ అవుతారని చెబుతున్నారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో కేబినెట్ నుంచి బర్తరఫ్ కి గురైన ఆయన ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను కలిసి తన అభిప్రాయాలను పంచుకున్నారు. చివరికి కమలం గూటికి చేరాలని తీర్మానించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈటల దంపతులిద్దరూ ఇవాళ ఒకే రోజు యాక్టివ్ గా వ్యవహరించటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

eatala Rajender

సర్కార్ కు జమున సవాల్..

దేవరయాంజల్ లోని మా భూముల్లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టిన పత్రికలోనే (బహుశా ‘నమస్తే తెలంగాణ’ అయుంటుంది) మా పైన దుష్ప్రచారం చేయటం బాధాకరమని ఈటల సతీమణి జమున ఆవేదన వ్యక్తం చేశారు. 1992లో ఆ ప్రాంతానికి వెళ్లిన తాము 1994లో భూములు కొన్నామని వెల్లడించారు. మెదక్ జిల్లా మూసాయిపేటలో 46 ఎకరాలు కొన్నామని చెప్పారు. అక్కడ మాకు అంతకన్నా ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నట్లు సర్వేలో తేలినా తాను తన ముక్కును నేలకు రాస్తానని, లేకపోతే అధికారులు ఆ పని చేస్తారా అని జమున సవాల్ విసిరారు. తమ భూముల్లో సర్వే చేయొద్దని చెప్పలేదని, తమ సమక్షంలోనే సర్వే చేయాలని మాత్రమే డిమాండ్ చేశామని స్పష్టం చేశారు. తాము ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని జమున తేల్చిచెప్పారు.