TELANGANA: తెలంగాణ గాంధీ.. ఏందిది?..

TELANGANA: రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తనపై చేసిన విమర్శలకు ఈటల రాజేందర్ స్పందించారు. వాళ్లు మాట్లాడిన మాటల్ని వాళ్ల కామన్ సెన్స్ కే వదిలేస్తున్నానని చెప్పారు. ఒకప్పుడు కేసీఆర్ ని తిట్టిన గంగుల ఇవాళ నీతులు చెప్పటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆరోగ్యం బాగాలేకపోతే చూద్దామని ప్రగతిభవన్ కి వెళ్లిన మంత్రుల్ని లోపలికి అనుమతించ లేదని, అప్పుడు ఈ గంగుల కమలాకరే ‘‘ఇంత అహంకారమా’’ అని తనతో అన్నారని ఈటల వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇవాళ మంగళవారం హుజూరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

Telangana Ministers

కేటీఆరే సీఎం కావాలనుకున్నా..

‘‘ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ని కలిసే ఛాన్స్ మంత్రులకు కూడా ఉండదు. పైన చెప్పుకున్న ఘటనే దీనికి ఉదాహరణ. 2014 వరకే కేసీఆర్ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. తెలంగాణ గాంధీగా పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి ఇవాళ ఎవరో ఇచ్చిన తప్పుడు సలహాలు, రిపోర్టులను బట్టి రాంగ్ రూట్ లో వెళుతున్నారు. నా మీద కక్ష కట్టారు. నన్ను సాధిస్తున్నారు. నా పద్ధతి నచ్చకపోతే పిలిచి రాజీనామా చేయమని ఆదేశిస్తే చేసేవాణ్ని. ఇప్పుడు నన్ను తప్పుపడుతున్న మంత్రులంతా ఒకప్పుడు నా సహచరులే. అందరిలాగే నేను కూడా కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు కేటీఆరే సీఎం కావాలని కోరుకున్నా. నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు’’ అని ఈటల రాజేందర్ వివరించారు.

Telangana Ministers

ఈటలకు హ్యాపీ న్యూస్..

ఈటల కుటుంబానికి చెందిన జమునా హ్యాచరీస్ ల్యాండ్స్, బిజినెస్ లో జోక్యం చేసుకోవద్దని, బలవంతంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు కేసీఆర్ సర్కార్ ను ఆదేశించింది. సంబంధిత భూముల్లో ప్రభుత్వ అధికారులు ఇటీవల ఆగమేఘాలపై నిర్వహించిన సర్వేని న్యాయస్థానం తప్పుపట్టింది. సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆక్షేపణ తెలిపింది. సర్వే చేసే ముందు ఈటలకు నోటీసులు ఇవ్వకపోవటాన్ని పట్టిచూపింది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఈటల రాజేందర్ కి గుడ్ న్యూస్ అని, కేసీఆర్ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.

Advertisement