East Godavari: గుండెలు పిండే విషాదం..సహర్షని ఒంటరి చేసిన కరోనా
Samsthi 2210 - July 1, 2021 / 04:43 PM IST

East Godavari: కరోనా ఎందరి కుటుంబాలలో విషాదం నింపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉన్న పిల్లలని ఒంటరి చేసి విచిత్రం చూస్తుంది. కరోనా వలన ఎందరో పిల్లలు ఒంటరి అయ్యారు. వారి పరిస్థితి ధైన్యంగా మారగా, కొందరికి వారి బాగోగులు చూసుకునే వారు కరువయ్యారు. తాజాగా సహర్ష అనే చిన్నారికి ఎంతటి దారుణమైన పరిస్థితి వచ్చిందో మాటలలో కూడా చెప్పలేం.
ఈ విషాద సంఘటన విన్న ప్రతి ఒక్కరు పగోడికి కూడా ఇలా జరగకూడదు అని ప్రార్ధఙస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని శివకోడు గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ మేడిచర్ల వి.సుధీర్‌రాయ్ తన భార్య శ్వేత హరిత, తల్లి ఉమామహేశ్వరి, కుమారుడు సాయి సత్య సహర్షతో కలిసి ఉంటున్నారు. ఏప్రిల్‌లో సుధీర్ రాయ్ దంపతులు కరోనా బారిన పడ్డారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో సుధీర్ రాయ్ దంపతులకు కరోనా సోకింది. దీంతో శ్వేత సోదరుడు రాజీవ్ వారిని ఆస్పత్రిలో చేర్చి మేనల్లుడైన సహర్షను చూసుకుంటున్నాడు. త్వరగానే కోలుకొని ఇంటికివ స్తారని అనుకుంటున్న క్రమంలో పిల్లాడి తండ్రి సుధీర్ రాయ్ ఏప్రిల్ 25న కన్నుమూసారు. మే9న తల్లి శ్వేత హరిత, మే 4న నాన్నమ్మ మృతి చెందింది. ఈ విషయాన్ని పిల్లాడికి తెలియకుండా రాజీవ్ మేనేజ్ చేస్తున్నాడు.
అయితే ఒకవైపు పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ ఫ్యామిలీకి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మరో విషాదం జరిగింది. కిర్లంపూడి మండలం రామచంద్రపురంలో ఉంటున్న సహర్ష తాతయ్య, అమ్మమ్మలు ఇటీవల కరోనాతో మరణించారు. వైద్యం కోసం దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టినా కూడా వారు ప్రాణాలతో తిరిగి రాలేదు. 40 రోజుల వ్యవధిలో ఐదుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన సహర్ష ఒంటరివాడయ్యాడు.
ఈ విషాద సంఘటన విన్న ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు సహర్ష. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న సహర్షకు వారి అమ్మనాన్నలు ఇక రారని తెలిస్తే ఆ పిల్లాడి దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ప్రస్తుతం మేనమామ రాజీవ్… సహర్ష బాధ్యతను తీసుకున్నారు.
ఒకే ఇంట్లో ఐదుగురు కరోనాతో మృతి చెందడం బాధాకరమన్న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. ప్రైవేట్ ఆస్పత్రికి చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు . ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు సహర్ష పేరుమీద బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామన్నారు. అలాగే సహర్షను కేంద్రీయ విద్యాలయంలో చేర్పిస్తానని.. అతడు అంగీకరిస్తే ఈ ఏడాదే చేరేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.