Duvvada : దువ్వాడ రైల్వే ప్లాట్‌ఫామ్ ఘటనలో గాయపడ్డ విద్యార్థిని మృతి
NQ Staff - December 8, 2022 / 08:30 PM IST

Duvvada : విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌కీ రైలుకీ మధ్య ఇరుక్కున్న విద్యార్థినిని అతి కష్టమ్మీద రైల్వే సహాయ సిబ్బంది రక్షించిన సంగతి తెలిసిందే. గంటన్నరపాటు బాధిత యువతి నరకయాతన అనుభవించింది.
కళాశాలకు వెళుతూ ప్రమాదవశాత్తూ ఆమె రైలుకీ, ప్లాట్‌ఫామ్‌కీ మధ్య ఇరుక్కుపోయింది. బాధిత విద్యార్థిని శశికళ ఎంసీఏ చదువుతోంది.
అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృత్యువాత..
తీవ్ర గాయాలపాలైన శశికళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, యూరిన్ బ్లాడర్ దెబ్బతిని రక్తస్రావం జరగడంతో ఆమె ఆరోగ్య పిస్థితి విషమించింది. వైద్యులు ఎంతలా ప్రయత్నించినా ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయారు.
కాగా, శశికళను రక్షించేందుకు రైల్వే రెస్క్యూ సిబ్బంది ప్లాట్‌ఫామ్‌ని కొంతమేర కట్ చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. యూరిన్ బ్లాడర్తోపాటు మరికొన్ని అవయవాలు కూడా దెబ్బతినడంతో ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
శశికళ మరణ వార్త అందర్నీ కలచివేస్తోంది. దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోన్న శశికళది అన్నవరం. గుంటూరు – రాయగడ రైలుకీ ప్లాట్‌ఫామ్‌కీ మధ్య దువ్వాడ రైల్వే స్టేషన్లో ఇరుక్కుపోయిందామె.