పోలీసులు యూనిఫామ్స్ వదిలేసి గులాబీ చొక్కాలు తొడుక్కున్నారా? డీకే అరుణ ఫైర్
Ajay G - October 27, 2020 / 09:38 PM IST

తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వేడి రాజకుంది. మామూలు వేడి కాదు.. రాజకీయ పార్టీలన్నీ దుబ్బాకలోనే పాగా వేశాయి. ఏ ఎన్నికకు కూడా ఇంతలా రాజకీయ పార్టీలు కొట్టుకున్నది లేదు కానీ.. ఒక్క స్థానం కోసం మాత్రం అధికార పార్టీతో సహా.. అన్ని పార్టీలు ఒకరి మీద మరొకటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

dk aruna serious on trs government over dubbaka bypolls
అధికార టీఆర్ఎస్ పార్టీ.. దుబ్బాక బీజేపీ అభ్యర్థిని టార్గెట్ చేస్తోందని.. కావాలని కుట్రలు పన్ని.. బీజేపీ అభ్యర్థిని గెలవకుండా చేయాలని చూస్తోందని బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే.
బీజేపీ గెలుపు దుబ్బాకలో ఖాయం అయిందని ఓర్వలేక.. సీఎం కేసీఆర్ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని.. ఆ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించి.. డబ్బు లేకున్నా.. ఉన్నట్టు పోలీసులతో జిమ్మిక్కులు చేయించి.. బీజేపీ అభ్యర్థిపై దాడి చేస్తున్నారని.. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ ఆడుతున్న కుట్ర అని బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
అయితే.. ఈ ఘటనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా స్పందించారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థిపై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలను వెంటనే తెలంగాణకు పంపించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
టీఆర్ఎస్ పార్టీపై దుబ్బాకలో ఎప్పుడో వ్యతిరేకత ప్రారంభం అయింది. అందుకే.. ఉపఎన్నికకు నోటిఫికేషన్ రాకముందు నుంచే టీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆమె ఆరోపించారు.
పోలీసులు యూనిఫామ్స్ వదిలేశారా? గులాబీ రంగు చొక్కలు తొడుక్కున్నారా? టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్నారా? పోలీసులు వాహనాల్లో డబ్బులు పంపుతున్నారు. పోలీసులే డబ్బుల కట్టలు తీసుకెళ్లి.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇంటిని, ఆయన బంధువుల ఇంట్లో దాడులు చేసి డబ్బుల కట్టలు లేకున్నా.. ఉన్నట్టు చూపిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలి. పోలీసులను ప్రజలు అసహ్యించుకునేలా చేసుకోకండి.. అంటూ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి హరీశ్ రావును దుబ్బాక ప్రజలు గమనిస్తున్నారు. ఆయన శైలి ఏం బాగాలేదు. ప్రజలకు ఆయన అబద్ధాలను చెప్పుతున్నారు. దుబ్బాకలో బీజేపీయే గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అందుకే.. టీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కి అక్కడ గెలవాలని ప్రయత్నిస్తోంది.. అంటూ ఆమె మండిపడ్డారు.
దుబ్బాకలో బీజేపీ గెలిస్తేనే సీఎం కేసీఆర్ అహంకారం తగ్గుతుంది. టీఆర్ఎస్ పార్టీకి సరైన బుద్ధి వస్తుంది. అందుకే దుబ్బాక ప్రజలు సరైన వ్యక్తిని ఎన్నుకొని ఓటు వేయండి.. అంటూ డీకే అరుణ హితువు పలికారు.