Yadadri Lakshmi Narasimha Swamy Devasthanam : యాదాద్రి దేవాలయానికి రికార్డు స్థాయి ఆదాయం: ఒకే రోజు కోటి రూపాయలు.!
NQ Staff - November 13, 2022 / 10:25 PM IST

Yadadri Lakshmi Narasimha Swamy Devasthanam : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చరిత్రలో సరికొత్త రికార్డు.! ఒకే రోజు ఏకంగా కోటి రూపాయల ఆదాయం లభించింది దేవస్థానానికి. వివిధ కౌంటర్ల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రూ.1,09,82,446/- . అంటే, అక్షరాలా ఒక కోటి తొమ్మిది లక్షల 82 వేల నాలుగు వందల 46 రూపాయలన్నమాట.
కార్తీక మాసం, అందునా ఆదివారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని నలు మూలల నుంచీ భక్తులు రావడంతో యాదాద్రి దేవస్థానం కిటకిటలాడింది. పొరుగు రాష్ట్రాల నుంచీ పెద్దయెత్తున భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
అత్యధికులు హైద్రాబాద్ నుంచే..
భక్తుల్లో ఎక్కువ మంది హైద్రాబాద్ నుంచి వచ్చిన వారేనని తెలుస్తోంది. యాదాద్రి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్‌నిర్మించిన సంగతి తెలిసిందే.
కాగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని ఆలయ అధికారులు చెప్పారు. ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఆలయ చరిత్రలో ఇంతవరకూ ఎప్పుడూ లేదన్నది ఆలయ అధికారుల వాదన.
ముందు ముందు యాదాద్రి ఆలయ ఆదాయం మరింత గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.