CM KCR : కేసీఆర్.. కేజ్రీవాల్ మీటింగ్ కి కారణం ఏంటి?
NQ Staff - May 26, 2023 / 09:56 PM IST

CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య స్నేహ బంధం కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉండగా.. మరో వైపు బీఆర్‌ఎస్ పార్టీతో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహం అనేది భవిష్యత్తులో బలమైన రాజకీయ పుణాదికి నాంది అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు గాను హైదరాబాద్ రాబోతున్నారు.
కేంద్రంకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క మద్దతు కోసం అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ కు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.
ఇటీవల గ్రూప్ ఏ అధికారుల బదిలీలు మరియు నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసింది. ఉద్యోగుల నియామకాలు మరియు బదిలీలకు సంబంధించిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేజ్రీవాల్ అంటూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. దాంతో రాష్ట్రాల ముఖ్య నేతలతో చర్చలు జరిపి కేంద్రంకు వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రెడీ అయ్యారు.