Cyber Cheating : రూపాయి పంప‌మ‌ని చెప్పి, రూ.99వేలు మాయం చేసిన కేటుగాడు

Cyber Cheating : ఈ మ‌ధ్య కాలంలో కేటుగాళ్లు కొంద‌రు అమాయ‌కుల‌ని ఉట్టిగానే బురిడీ కొట్టిస్తున్నారు. ఏవో మాయ‌మాట‌లు చెప్పి దొరికిన కాడికి దోచుకుంటున్నారు. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం వీళ్ల మాయ‌మాట‌ల‌కు మోస‌పోతున్నారు. ద‌గ్గుబాటి సురేష్ బాబు సైతం సైబ‌ర్ నెర‌గాళ్ల వ‌ల‌లో ప‌డ్డారు. ఇలాంటి వారి జాబితా చాలానే ఉంది.

Cyber Cheating case
Cyber Cheating case

తాజాగా జీడిమెట్లకు చెందిన చంద్రమోహనేశ్వర్‌రెడ్డి కుమార్తె అమెరికాలో ఉన్నత చదువులను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి కొన్ని పేపర్లను ఫెడెక్స్ కొరియర్ ద్వారా పంపించింది. అయితే తన కుమార్తె పేపర్లు పంపి చాలా రోజులు గడుస్తున్నా… ఇంకా పేపర్లు తనకు చేరకపోవడంతో గూగుల్‌లో కొరియర్ సంస్థ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికి ఓ నంబర్‌కు ఫోన్ చేశాడు.

అయితే ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి తనకు గూగుల్ పేలో ఓ రూపాయి పంపమని అడిగాడు. దీంతో చంద్రమోహనేశ్వర్‌రెడ్డి తన గూగుల్ పే నుంచి ఒక రూపాయి పంపించాడు. దీంతో ఆయన బ్యాంకు ఖాతా నుంచి వెంటనే రూ.99 వేలు నగదు డెబిట్‌ అయ్యాయి.

తాను మోసపోయానని గ్రహించిన చంద్రమోహనేశ్వర్‌రెడ్డి వెంటనే పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు