Sehwag: ఏంటి ఇలా అడుక్కుంటున్నావ్‌.. అక్త‌ర్‌కు సెహ్వాగ్ పంచ్

Sehwag: పాకిస్తాన్‌- ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానుల‌లో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌రాలు బిగ‌ప‌ట్టి మ‌రీ మ్యాచ్ వీక్షిస్తుంటారు. ఈ మ్యాచ్‌పై కొన్ని కోట్ల బెట్టింగ్స్ కూడా న‌డుస్తుంటాయి. ఇప్పుడు పాక్‌తో క్రికెట్ ఆడేందుకు మ‌నోళ్లు సిద్ధంగా లేక‌పోగా, ఎప్పుడైన వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో మాత్రం త‌ల‌ప‌డుతుంటారు.

Sehwag
Sehwag

గతంలో పాక్‌- ఇండియా మ‌ధ్య టెస్ట్‌లు, వ‌న్డేలు భారీగానే జ‌రిగేవి. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో దాయాది పాక్ బౌల‌ర్స్‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన విష‌యం తెలిసిందే. ఆ మ్యాచ్ చూసిన వారు అది టెస్ట్ మ్యాచా, వ‌న్డే మ్యాచ్ అనేది అర్ధం కాలేదు. సెహ్వాగ్ (375 బంతుల్లో 309; 39 ఫోర్లు, 6 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు.

బౌల‌ర్స్ త‌మ అస్త్రాల‌న్ని ఉప‌యోగించి సెహ్వాగ్‌ని ఔట్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన స‌ఫలం కాలేదు. దీంతో స్లెడ్జింగ్ కూడా చేశారు. ముఖ్యంగా పాక్ ప్రధాన పేసర్ షోయబ్ అక్తర్ సెహ్వాగ్‌ను పదేపదే విసిగించాడు. వారి మధ్య జరిగిన నాటి సంభాషణను మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తాజాగా పంచుకున్నాడు. ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి విష‌జ్ఞాలు చెప్పాడు.

సెహ్వాగ్ ఆ మ్యాచ్‌లో డ‌బుల్ సెంచరీ పూర్తి చేశాక అక్త‌ర్ అత‌నికి షార్ట్ పిచ్ బంతులు సంధించ‌డం మొద‌లు పెట్టాడు. ఆ బంతుల‌ని సెహ్వాగ్ డకింగ్( బంతిని వదిలేసి కిందికి వంగడం) చేశాడు. సెహ్వాగ్ వ్యూహానికి విసిగిపోయిన అక్త‌ర్ అత‌ని ద‌గ్గ‌ర‌కు వచ్చి ఒక షార్ట్ పిచ్ బాల్ ఆడ‌వ‌చ్చు క‌దా అని అన్నాడు. దీనికి సెహ్వాగ్ .. . నువ్వు బౌలింగ్ చేస్తున్నావా లేక అడుక్కుంటున్నావా అని దిమ్మతిరిగే బదులిచ్చాడని నాటి మ్యాచ్‌ విశేషాలను మంజ్రేకర్‌ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

సెహ్వాగ్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆ నాటి మ్యాచ్‌లో భార‌త్ రెండు రోజుల‌లోనే 650 ప‌రుగులు చేసింది. మిగ‌తా రెండు రోజులలో పాక్ రెండు ఇన్నింగ్స్ కూడా పూర్తి కావ‌డంతో భార‌త్ 52 ప‌రుగుల తేడాతో ఇన్నింగ్స్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ అప్ప‌ట్లో దుమారం కూడా రేపిన విష‌యం తెలిసిందే. సచిన్‌ టెండూల్కర్‌ (194 ) డబుల్‌ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మ్యాచ్‌ను డిక్లేర్‌ చేశాడు. ఇది పెద్ద వివాదం అయ్యింది. సచిన్‌ తన కన్న ముందు 5 డబుల్‌ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్‌ మ్యాచ్‌ను డిక్లర్‌ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్‌ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్‌కు ముందే చెప్పానని ద్రవిడ్‌ వివరణ ఇచ్చాడు.