Covid 19 : హైద్రాబాద్‌లో కొత్త వేరియెంట్ వెలుగులోకి.. కేసులు బాగా పెరిగే ఛాన్స్ ఉందని టాక్..!
NQ Staff - May 20, 2022 / 03:58 PM IST

Covid 19 : కరోనా మహమ్మారి కొంత కాలంగా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మనిషిని మనిషి కలవాలంటే భయంగా ఉంది. కరోనా మహమ్మారి ఇప్పట్లో మనల్ని వదిలేలా లేదు. ఇప్పటికీ పలు దేశాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకూ తన రూపు మార్చుకుంటున్న కోవిడ్-19 అత్యంత ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి.
ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు రెట్టింపు వ్యాప్తి, ప్రభావం కలిగించేవిగా ఉన్నాయని పరిశోధకులు, వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తాజాగా భారత్ లో బీఏ.4 ఒమిక్రాన్ వేరియంట్ తొలికేసు నమోదైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బీఏ.4 ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసును గుర్తించారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ-4 సోకిన దక్షిణాఫ్రికా వ్యక్తి ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో ఓ సమావేశానికి వచ్చి వెళ్లిపోయారు.
ఆయనకు పాజిటివ్ రావడంతో.. ఆ సమావేశంలో పాల్గొన్న 24 మందికీ టెస్టులు చేశారు. నెగెటివ్ వచ్చినప్పటికీ వారందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచారు. కరోనా కొత్త వేరియంట్ గురించి ఆందోళన అవసరం లేదని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు తెలిపారు. కాగా, బీఏ-4 వేరియంట్ కేసులు దక్షిణఫ్రికాలో భారీగా నమోదవుతున్నాయి. దీనికి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే గుణం ఉండడంతో ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది.

Covid 19 Going Most Dangerous in Hyderabad
దేశంలోనే బీఏ-4 వేరియంట్ తొలి కేసు హైదరాబాద్‌లో నమోదు కావడం చర్చనీయాంశమైంది. అయితే, ఈ వేరియంట్ ప్రభావం మన దేశంలో పెద్దగా ఉండకపోవచ్చని ఆరోగ్య శాఖ భావిస్తోంది. కాగా, తెలంగాణలో కొత్తగా 45 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,92,710 కు చేరుకుందని తెలిపింది.
అలాగే, ఇప్పటివరకు మొత్తం 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసుల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 28 కేసులు నమోదయ్యాయి. మొత్తం 32 మంది వ్యాధి నుండి కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,88,216కి చేరుకుంది. యాక్టివ్ కేసులు 383గా ఉన్నాయి. కేసు మరణాల రేటు 0.51 శాతం మరియు రికవరీ రేటు 99.43 శాతంగా ఉంది.

Covid 19 Going Most Dangerous in Hyderabad
ఇదిలావుండగా, భారత్ లో కరోనా వైరస్ కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,364 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,31,29,563కు చేరాయి. ఇదే సమయంలో వైరస్ తో పోరాడుతూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,24,303కు పెరిగింది. మరణాల రేటు 1.22 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.7 శాతంగా ఉంది.