Madhya Pradesh : యూట్యూబ్‌లో అశ్లీల వీడియో ప్రకటనలు : పరీక్ష తప్పాడట.! సుప్రీంకోర్టు వాతలెట్టిందట.!
NQ Staff - December 10, 2022 / 03:21 PM IST

Madhya Pradesh : సోషల్ మీడియాలో ‘ఛండాలం’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ స్థాయికి దిగజారిపోయింది పరిస్థితి. ఇంటర్నెట్ తెరిస్తే అశ్లీలమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటర్నెట్ అశ్లీలంపై ఉక్కుపాదం మోపాలనే చర్చ తప్ప, కార్యరూపంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి.
కాగా, మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి చిత్రమైన వాదనతో ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. యూ ట్యూబ్‌లో కనిపించిన అశ్లీల వాణిజ్య ప్రకటనల కారణంగా తాను పోటీ పరీక్షల్లో విఫలమయ్యానన్నది సదరు పిటిషనర్ ఆవేదన. అంతే కాదు, ఏకంగా 75 లక్షల పరిహారాన్ని గూగుల్ ఇండియా నుంచి ఇప్పించాలని కూడా సదరు పిటిషనర్ కోర్టుకు విన్నవించుకున్నాడు.
ఇంతకంటే ఘోరమైన పిటిషన్ వుంటుందా.?
‘ఇంటర్నెట్ ప్రకటనలు చూసి పోటీ పరీక్షల్లో విఫలమయ్యావా.? నిన్ను ప్రకటనలెవడు చూడమన్నాడు.? ఇంతకంటే ఘోరమైన పిటిషన్ ఇంకోటి వుండదు..’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓకా ధర్మాసనం కేసుని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
మధ్యప్రదేశ్ వాసి అయిన పిటిషనర్‌కి లక్ష రూపాయల జరీమానా కూడా వేసింది కోర్టు సమయాన్ని వృధా చేశారని మండిపడుతూ. తాను నిరుద్యోగిననీ, అంత జరీమానా చెల్లించలేనని సదరు వ్యక్తి వేడుకోగా, జరీమానాను 25 వేల రూపాయలకు సర్వోన్నత న్యాయస్థానం తగ్గించింది.