Venkaiah Naidu: రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఇంకా గలాటా కొనసాగుతూనే వుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ప్రమోషన్ ఇవ్వకుండా, రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిషా నుంచి ద్రౌపది మర్ముని బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు రాజకీయాలకు అతీతంగా వుండాలి.

కానీ, రాజకీయాల చుట్టూనే వ్యవహారం నడుస్తోందంతా. బీజేపీలో అంచలంచెలుగా ఎదిగిన వెంకయ్యనాయుడు, ఆ పార్టీకి చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలోనే ఆయనకు కేంద్ర మంత్రిగానూ అవకాశం దక్కిన మాట వాస్తవం. అయితే, దేశ ప్రధమ పౌరుడనే ప్రత్యేకమైన గుర్తింపుకు ఆయన నోచుకోలేకపోవడం ఆశ్చర్యకరమే.
వెంకయ్యనాయుడు గనుక ఉత్తరాదిన జన్మించి వుంటే..
వెంకయ్య తెలుగువారు కావడం వల్లనే, ఆయనకు రాష్ట్రపతి పదవి పదవి రాలేదా.? దక్షిణాదికి చెందినవారు అయి వుండకపోతే వెంకయ్యకు రాష్ట్రపతిగా అవకాశం వచ్చి వుండేదేమో.. అంటూ వెంకయ్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెల్లగక్కుతున్నారు.
నిజానికి, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదు. ప్రాంతీయ విభేదాలు అస్సలేమాత్రం ఆహ్వానించదగ్గ విషయాలు కావు. కానీ, రాజకీయాల్లో అన్నీ వుంటాయ్. రాజ్యాంగబద్ధమైన, రాజకీయాలకు అతీతమైన పదవి అయినాగానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్రపతి ఎన్నిక చుట్టూ రాజకీయం నడుస్తుండడం శోచనీయం.