Congress Party : ఆయన చేతిలో వీళ్లు తోలుబొమ్మలు! ఆకట్టుకుంటోన్న కాంగ్రెస్ వినూత్న ప్రచారం

NQ Staff - November 11, 2023 / 05:35 PM IST

Congress Party : ఆయన చేతిలో వీళ్లు తోలుబొమ్మలు! ఆకట్టుకుంటోన్న కాంగ్రెస్ వినూత్న ప్రచారం

Congress Party :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మూడో సారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. అలాగే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా పవర్ చేతికందుకోవాలని కాంగ్రెస్ కలలు కంటోంది. బీసీ సీఎం నినాదంతో ‘ముఖ్యమంత్రి కుర్చీ’పై కర్ఛీఫ్ వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో అభ్యర్థులంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ముక్కోణ పోటీ హోరాహోరీగా సాగుతుండగా..వీరి వెరైటీ ప్రచారం ఓటర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఒక్కొక్కరూ ఒక్కో తరహ ప్రచారం జనాల్లోకి వెళ్లాలని చూస్తున్నారు.

మొదట్లో బీఆర్ఎస్ ప్రచారం ఉవ్వెత్తున సాగించింది. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గులాబీ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టి ప్రచారం చేసింది. కేసీఆరే తమ ప్రధాన ఆకర్షణ ఆ పార్టీ ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తోంది. తెలంగాణను కాపాడేది కేసీఆర్ ఒక్కరేనని.. విపక్ష పార్టీల నేతలను విమర్శిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ప్రధాన మీడియా, సోషల్ మీడియాను ఫుల్లుగా వాడుకుంటూ ముందుకెళ్తోంది. ‘గులాబీల జెండలే రామక్క’ పాటను సెలబ్రిటీలు, వివిధ వర్గాల జనాలతో షార్ట్స్, రీల్స్ చేయిస్తూ..జనాల్లోకి వెళ్తోంది.

Congress Party Will Campaign Innovatively

Congress Party Will Campaign Innovatively

ఇక బీజేపీలో మొదట్లో ఉన్నంత జోష్ లేకపోయినా.. బీసీ సీఎం నినాదంతో ప్రజల ఆదరణ చురగొనేందుకు ప్రయత్నిస్తోంది. మోడీ వరుసగా తెలంగాణలో సభలు పెట్టడంతో తమకు లాభిస్తుందని భావిస్తోంది. బహుజన జనాభా ఎక్కువున్న తెలంగాణలో ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు…ప్రధాని మోడీ వరుసగా బీసీ, దళిత సభలకు హాజరవుతున్నారు. అలాగే రెండో విడత ప్రచారాన్ని మూడు రోజుల పాటు చేయనున్నారు.

ఇందిరమ్మ పార్టీగా తెలంగాణలో మంచి క్యాడర్ ఉన్న కాంగ్రెస్.. ఈసారి తనదే అధికారమని దూకుడుగా వెళ్తోంది. కర్నాటక ఎన్నికల తర్వాత కొత్త జోష్ నింపుకున్న కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటోంది. తాను ఏం చేసింది అనే దానికంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకత ఓటుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. అందుకే వినూత్న వీడియోలు, షార్ట్స్, మీమ్స్..లాంటి కొత్త తరహా ప్రచారంలో దూసుకెళ్తోంది. వీటికి జనాల్లో విపరీత స్పందన వస్తోంది.

కాంగ్రెస్ ప్రధానంగా కేసీఆర్, మోడీ వైఫల్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు, బీజేపీ ఒక్కటే అని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. ‘‘గల్లీలో ఫైట్.. ఢిల్లీలో దోస్త్..’’అని ఆ పార్టీల వైఖరిని బలంగా తీసుకెళ్తోంది. తాజాగా 11న సికింద్రాబాద్ లో మోడీ ప్రచార సభ ఉండడంతో ఒక్క రోజు ముందుగానే వినూత్న ప్రచారానికి తెరతీసింది.

బీఆర్ఎస్, ఎంఐఎంలను బీజేపీ చేతిలో కీలుబోమ్మలని తెలియజేసేలా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను ప్రతిబింబించేలా తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను తోలుబొమ్మలుగా చేసి నరేంద్ర మోడీ ఆడిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. వీటికి జనాల్లో విపరీత స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. హైటెక్ సిటీ, బేగంపేట లాంటి అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది.

Congress Party Will Campaign Innovatively

Congress Party Will Campaign Innovatively

సునీల్ కనుగోలు మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ ఈ సారి వినూత్న ప్రచారం సాగిస్తోంది. దేశంలో, కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు ఉండే అడ్వంటేజీని బాగా వాడుకుంటోంది. ఇప్పటి వరకైతే వినూత్న ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉంది. ఎన్నికలకు మరో 19 రోజుల టైం ఉండడంతో రాజకీయ పార్టీలు వినూత్న ప్రచారంపై మరింత ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us