Congress: ఫ్రీగా అంబులెన్స్ కావాలా?.. ‘గాంధీ భవన్’కి ఫోన్ చేయండి..

Congress: కరోనా వైరస్ బాధితుల కోసం హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో మూడు అంబులెన్స్ లని ఉచితంగా పంపించేందుకు సిద్ధం చేశారు. వాటిని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఆదివారం ప్రారంభించారు. సంగారెడ్డి శాసన సభ్యుడు జగ్గారెడ్డి ఇచ్చిన ఆర్థిక సాయంతో వీటిని ఏర్పాటుచేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సహాయం కావాల్సినవాళ్లు పీసీసీ కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ నంబర్ 040-24601254కి కాల్ చేయాలని సూచించారు. కొవిడ్-19 పేషెంట్లు గానీ, వాళ్ల కుటుంబ సభ్యులు గానీ ఫోన్ చేస్తే ఈ వాహనాలని పంపుతామని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ఏ హాస్పిటల్ నుంచి ఏ హాస్పిటల్ కైనా వెళ్లేందుకు ఈ అంబులెన్స్ లని వాడుకోవచ్చని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి, ఆయన కూతురు, పొన్నాల లక్ష్మయ్య తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

350 ఆక్సీజన్ ప్లాంట్లున్నాయ్..

కరోనా నివారణకు సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. పల్లెల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు తక్కువ ఉన్నాయంటూ ప్రచారం చేయటాన్ని తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 350 ఆక్సీజన్ ప్లాంట్లు ఉన్న సంగతి కేసీఆర్ సర్కార్ కి తెలుసా అని పొన్నాల ప్రశ్నించారు.

వేషాలోణ్ని.. నమ్మొద్దు..

దేశ ప్రధాని నరేంద్ర మోడీ వివిధ కార్యక్రమాల్లో ధరించిన తలపాగాలను ఎద్దేవా చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ రోజు ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. మోడీ తన తలకు పెట్టుకున్న 18 రకాల పాగాల ఫొటోలను ఒకే ఫ్రేమ్ లో పెట్టి షేర్ చేసింది. దానికి సందర్భోచితమైన వేమన పద్యాన్ని కూడా జత చేసింది. వేషాలోణ్ని నమ్మొద్దంటూ ప్రజలను హెచ్చరించింది.