GHMC: హైదరాబాద్ లో ఓటమిని కొనితెచ్చుకున్న బీజేపీ
Kondala Rao - May 3, 2021 / 01:25 PM IST

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కి జరిగిన ఉపఎన్నికలో ఎవరూ ఊహించనివిధంగా కాంగ్రెస్ పార్టీ క్యాండేట్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలిచారు. దీంతో కమలనాథులు కంగుతిన్నారు. కాషాయం పార్టీ ఈ ఓటమిని కొనితెచ్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లింగోజిగూడ వ్యవహారం తెలంగాణ బీజేపీలో కొద్ది రోజులుగా కలకలం రేపుతోంది. 2020 డిసెంబర్ లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించినా.. కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో బైఎలక్షన్ పెట్టాల్సి వచ్చింది. దీనికి ముందు కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఏంటవి?..
ఆకుల రమేష్ గౌడ్ చనిపోవటంతో ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని బీజేపీలోని కొంత మంది నాయకులు నిర్ణయించుకున్నారు. అయితే వాళ్లు ఆ విషయాన్ని తమ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కి చెప్పకుండా నేరుగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లి మాట్లాడారు. దీంతో అధికార పార్టీ అక్కడ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అంతేకాదు. మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మీరు కూడా పోటీకి దూరంగా ఉంటే బాగుంటుందని సూచించారు. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పారో తెలియదు గానీ ఆ తెల్లారి నుంచే కమలం పార్టీలో కొత్త గొడవ మొదలైంది.
ఢిల్లీ దాకా..
‘రాష్ట్ర అధ్యక్షుణ్ని అయిన తనకు చెప్పకుండా కేటీఆర్ దగ్గరికి ఎలా వెళతారు’? అంటూ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. బాధ్యుల నుంచి వివరణ కోరారు. ఈ ఘటనను ఢిల్లీలోని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లటమే కాకుండా సమగ్ర విచారణ కోసం ఒక కమిటీని కూడా వేశారు. అంతటితో ఆగలేదు. తప్పుచేసినవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తప్పకుండా గెలిచే చోట ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేయటం ఏంటని బండి సంజయ్ కారాలు మిరియాలు నూరారు. ఈ లోపు హస్తం పార్టీవాళ్లు అభ్యర్థిని బరిలోకి దింపటంతో ఉపఎన్నిక నిర్వహించక తప్పలేదు. బీజేపీ తరఫున ఆకుల రమేష్ గౌడ్ కుమారుడికి బదులు మందుగుల అఖిల్ పవన్ గౌడ్ ని పోటీకి పెట్టారు. చివరికి కాంగ్రెస్ అభ్యర్థిని విజయం వరించింది. దీంతో నగరంలో హస్తం పార్టీ కార్పొరేటర్ల సంఖ్య మూడుకి పెరిగింది.