Comedian Prudhvi Raj : ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ రాజ్ ఎందుకు జనసేన కండువా కప్పుకోలేదు.?
NQ Staff - November 26, 2022 / 07:58 PM IST

Comedian Prudhvi Raj : గతంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు కూడా. కానీ, ‘వెనక నుంచి వాటేసుకోవడం’ పేరుతో విడుదలైన ఆడియో టేప్ కారణంగా, పృధ్వీ రాజ్, ఆ పదవి కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి కూడా దూరమయ్యారు.
ప్రస్తుతం జనసేన పార్టీతో అంటకాగుతున్నారు పృధ్వీ రాజ్. అయితే, జనసేన పార్టీలో ఇప్పటిదాకా ఆయన అధికారికంగా చేరింది లేదు. ఎందుకు.? పృధ్వీ రాజ్ జనసేన కండువా కప్పుకోవడం ఎందుకు ఆలస్యమవుతోంది.?
అసలు విషయం ఇదే.. వివరించిన పృధ్వీ
తాజాగా, న్యూస్ క్యూబ్‌తో మాట్లాడిన పృధ్వీ రాజ్, తాను జనసేన పార్టీలో చేరిపోయినట్లేనని అన్నారు. మంచి సందర్భం చూసుకుని జనసేన పార్టీ కండువా కప్పుకుంటానని వివరించారాయన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభానికి ముందో, ప్రారంభమయ్యాకనో.. ఆ తంతు కూడా పూర్తవుతుందని అన్నారు పృధ్వీ రాజ్.
వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేస్తారా.? పోటీ చేస్తే ఎక్కడి నుంచి.? అని ప్రశ్నిస్తే, ‘పైవాడి దయ.. ఎన్నికల కోసమైతే జనసేనలో వుండాల్సిన అవసరం లేదనీ, ప్రజల కోసం పని చేయాలనుకుంటే జనసేనలోకి రావాలనీ.. ప్రజా సేవ చేస్తే, అవకాశాలు వాటంతట అవే వస్తాయనీ జనసేనాని చెప్పారు.. దానికి కట్టుబడే వుంటాను..’ అని చెప్పుకొచ్చారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్.