SS Rajamouli : అసెంబ్లీ ఎన్నికల్లోకి దిగుతున్న రాజమౌళి.. ఇక ఓట్ల ప్రభంజనమే..!
NQ Staff - March 10, 2023 / 01:40 PM IST

SS Rajamouli : ఏంటి రాజమౌళి అసెంబ్లీ ఎన్నికల్లోకి దిగుతున్నారా.. అని మీరు డౌట్ పడుతున్నారు కదా. అవునండి మీరు విన్నది నిజమే. రాజమౌళి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లోకి దిగబోతున్నారు. అయితే ఆయన పోటీ చేయట్లేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగం కాబోతున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఒక వ్యక్తి కాదు. ఒక బ్రాండ్ ఇమేజ్. త్రిబుల్ ఆర్ తో ఆయన ఇమేజ్ ఖండాంతరాలను దాటుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి క్రేజ్ మార్మోగిపోతోంది. ఇప్పటికే ఎన్నో అరుదైన గౌరవాలు ఆయనకు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే మరో అరుదైన గౌరవం రాజమౌళికి దక్కింది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు ఆయన్ను ఎన్నికల ఐకాన్ గా నియమిస్తూ అక్కడి కలెక్టర్ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక రాష్ట్రానికి మే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాయచూర్ జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అక్కడి కలెక్టర్ కొత్త ఆలోచనకు తెర తీశారు. ఇందులో భాగంగానే రాజమౌళిని ఎంచుకున్నారు.
ఒప్పుకున్న రాజమౌళి..
రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రభంజనంతో ప్రపంచంలోనే ప్రభావశీల వ్యక్తిగా మారారు. ఆయన ప్రచారం చేస్తే కచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. జక్కన్నతో కలిసి పని చేసేందుకు నిర్ణయించాం. రాజమౌళి కూడా దీనికి అంగీకరించారు అంటూ కలెక్టర్ తెలిపారు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రాజమౌళిది కూడా రాయచూర్ జిల్లాలోని మానవి తాలూకా అమరేశ్వర్ క్యాంపు. ఈ విషయాన్ని గతంలో స్వయంగా రాజమౌళి ప్రకటించారు. రాజమౌళి పుట్టింది ఈ జిల్లాలోనే కాబట్టి.. ఇక్కడ జక్కన్న ప్రచారం చేస్తే బాగుంటుందని చెబుతున్నారు అధికారులు. ఈ విషయం తెలుసుకున్న రాజమౌళి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.