Coca-Cola: రొనాల్డో చర్య.. కోకా కోలాకు 29వేల కోట్లు ఢమాల్‌!

Coca-Cola: ఇటీవ‌లి కాలంలో సినిమా సెల‌బ్రిటీలు, క్రీడాకారులు ప్ర‌మోష‌న్స్‌పైన బాగా దృష్టి పెడుతున్న సంగ‌తి తెలిసిందే. పాపులారిటీని బ‌ట్టి ఆయా కంపెనీలు వీళ్ల‌కు కోట్లు కుమ్మ‌రిస్తున్నాయి. ఒక్కోసారి యాడ్స్ వ‌ల‌న సెల‌బ్స్ లేని పోని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా వాటిని ఎలాగోలా ప‌రిష్క‌రించుకొని ప్ర‌చారక‌ర్త‌లుగా ముందుకు సాగుతున్నారు. అయితే పోర్చుగ‌ల్ స్టార్ సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఓ సంచలన ప్రకటన చేశాడు. ఓ కంపెనీకి చెందిన డ్రింక్స్ తాగొద్దు.. అవసరమైతే మంచి నీరు తాగండి అంటూ ప్రకటన చేశాడు. ఈ విష‌యం ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

యూరో ఛాంపియ‌న్ షిప్ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన రొనాల్డో.. త‌న‌కు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్ల‌ను చూస్తూ కాస్త అస‌హ‌నంగా ప‌క్కకు పెట్టి, వాటర్‌ బాటిల్‌ పైకెత్తి ‘అగ్వా’(పోర్చుగ్రీసు భాషలో మంచినీళ్లు అని అర్థం) తాగండి అని కామెంట్‌ చేశాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మార‌డంతో కోకా కోలా కంపెనీకి ఊహించని రీతిలో డ్యామేజ్‌ జరిగింది. 36 ఏళ్ల రొనాల్డో కామెంట్‌ ఎఫెక్ట్‌ మార్కెట్‌పై దారుణంగా చూపెట్టింది.

రొనాల్డో ఇప్పుడు ఏ డ్రింక్‌ల పట్ల అయితే అయిష్టత, అసహ్యం కనబరిచాడో.. కొన్నేళ్ల క్రితం అదే కార్బొనేట్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ కంపెనీకి ఒక యాడ్‌ చేశాడు. 2006లో 22 ఏళ్ల రొనాల్డో కోకా కోలా బ్రాండ్‌కు యాడ్‌ చేశాడు. ఇప్పుడు అదే కంపెనీపై విరుచుకుప‌డ్డాడు.ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొందరు రొనాల్డ్‌ తీరును తప్పుబడుతున్నారు.

అయితే రొనాల్డో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌నతో ​కోకా కోలా స్టాక్‌ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్‌ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకా కోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లినట్లయ్యింది. అయితే రొనాల్డో తీరుపై యూరో ఛాంపియన్‌షిప్‌ స్పానర్‌షిప్‌గా వ్యవహరిస్తున్న కోకాకోలా స్పందించింది. ‘

ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నీళ్లతో పాటు కోకా కోలా డ్రింక్‌లు కూడా స‌ర్వ్ చేస్తుంటాం. ఎవ‌రికి న‌చ్చిన‌వి వారు తాగుతారు. అతని కంటే ముందు ఎంతో మంది ప్లేయర్లు కోక్‌ తాగడం చూసే ఉంటారు అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కొంత కాలంగా అతని డైట్‌లో మార్పు వచ్చిందని అందుకే ఇలా మాట్లాడి ఉంటాడ‌ని కొంద‌రు అంటున్నారు. ఏదేమైన రొనాల్డో కామెంట్స్ ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.ఈ అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు… ప్రస్తుతం యూరో చాంపియ‌న్‌షిప్‌ పోటీల్లో భాగంగా మంగ‌ళ‌వారం త‌న తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రొనాల్డో రెండు గోల్స్ చేయడంతో పోర్చుగల్ 3-0తో అలవోక విజయాన్ని అందుకుంది.