CM KCR: సీఎం కేసీఆర్.. ముందే చెప్పారు.. సాధించారు..

CM KCR: కరోనా వైరస్ ను జయిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే చెప్పి సాధించారు. నిన్న మంగళవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఆయనకి ఎట్టకేలకు కొవిడ్ నెగెటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో కేసీఆర్ పర్సనల్ డాక్టర్ ఎంవీ రావు ఇటీవల చెప్పిన విషయాలు గుర్తుకొస్తున్నాయి. కరోనా పాజిటివ్ అని తేలినప్పటికీ సీఎం కేసీఆర్ ఎంతో ధైర్యంగా ఉన్నారని, వైరస్ ను జయిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పిన ఆయన దాన్ని నిరూపించారని ఎంవీ రావు ఈమధ్య పేర్కొన్నారు. వయసు రీత్యా ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించినా కేసీఆర్ ఒప్పుకోలేదని, హోం ఐసోలేషన్ లోనే ఉంటూ తమ సలహాలను తూచా తప్పకుండా పాటించారని తెలిపారు.

పాలనపై ఫోకస్

కొవిడ్ వైరస్ సోకినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫాం హౌజ్ లోనే ఉండే పాలన అంశాలపై ఫోకస్ పెట్టారని, ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ ఆదేశాలను జారీ చేశారని డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. గత బుధవారం నిర్వహించిన యాంటీజెన్ టెస్టులో సీఎంకి కొవిడ్ నెగెటివ్ వచ్చిన సందర్భంలో ఆయన ఈ విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో సైతం నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కానీ తెల్లారి గురువారం వెలువడ్డ రిజల్ట్ అస్పష్టంగా వచ్చింది. దీంతో ఇంకోసారి టెస్టు నిర్వహించేందుకు, ముఖ్యమంత్రి రోజువారీ విధుల్లో చేరేందుకు దాదాపు వారం రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని పరీక్షలు నార్మల్ గా ఉండటంతో రేపో మాపో ప్రగతి భవన్ కి వస్తారని చెబుతున్నారు.

పూర్తిగా కోలుకోబట్టే..

సుమారు రెండు వారాలకు పైగా తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న సీఎం కేసీఆర్.. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోబట్టే అటు ప్రభుత్వం పైన, ఇటు పార్టీ పైన పూర్తిగా దృష్టి పెట్టారు. సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ విషయంలో శరవేగంగా స్పందించారు. ఒకదాని తర్వాత ఒకటిగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెర వెనుకే ఉన్నప్పటికీ గతంలో మాదిరిగానే యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు నాగార్జునసాగర్ బైఎలక్షన్ తోపాటు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కేసీఆర్ కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

Advertisement