Nagarjuna Sagar: సభను అడ్డుకోగలరేమో.. సక్సెస్ ని ఆపలేరుగా..
Kondala Rao - April 13, 2021 / 05:12 PM IST

Nagarjuna Sagar నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం కోసం సీఎం కేసీఆర్ రేపు బుధవారం హాలియా ప్రాంతంలో ఏర్పాటుచేసిన మీటింగ్ ని అడ్డుకోవటానికి ప్రత్యర్థులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి ఫలించట్లేదు. నిన్న సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. అర్జెంటుగా విచారణ జరపాలని అడిగారు. ‘కుదరదు’ అని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అయినా ఈరోజు మంగళవారం హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు. దాన్ని కూడా చీఫ్ జస్టిస్ తోసిపుచ్చారు. ఇట్లయితే లాభం లేదనుకున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కేంద్ర బలగాలతో సాగర్ బైఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సేమ్.. తిరుపతిలో కూడా తెలుగుదేశం పార్టీ ఇదే రూట్ లో వెళుతోంది.

cm kcr
ఏం సాధిస్తారు?..
ఒకవేళ సీఎం కేసీఆర్ మీటింగ్ జరగలేదు అనుకోండి. కాంగ్రెస్సో, మరో పార్టీయో ఆ సభని విజయవంతంగా అడ్డుకున్నారనుకోండి. దానివల్ల వాళ్లకి వచ్చే ప్రయోజనం ఏంటి?. సీఎం కేసీఆర్ కి, ఆయన పార్టీ టీఆర్ఎస్ కి సానుభూతి పెరుగుతుందే తప్ప నష్టం ఏమీలేదు. పైగా నాగార్జునసాగర్ లో అధికార పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. ఎందుకంటే బీసీ సంఘాలు, రెండు కమ్యూనిస్ట్ పార్టీలు, ఉద్యోగ సంఘాలు.. ఇలా వివిధ వర్గాలు అతనికి ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎలాగూ కారు పార్టీకే సపోర్ట్ చేస్తారు. కాబట్టి కేసీఆర్ మీటింగ్ జరిగినా, జరక్కపోయినా గులాబీ పార్టీకి ప్లస్సే గానీ మైనస్ కాదు. అందువల్ల టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులు సీఎం కేసీఆర్ మీటింగ్ ని అడ్డుకోవటంపై ఫోకస్ పెట్టడం కన్నా తమకు నాలుగు ఓట్లు ఎక్కువ తెచ్చుకునే మంచి ఆలోచనలు చేయాలని, ఎక్కువ సమయం దానికి కేటాయించాలని, ఇలాంటి వాటికి కాదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఏపీ టీడీపీ బాటలో..
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించటానికి రాజారెడ్డి రాజ్యాంగం అనే మాటను ఎక్కువగా వాడుతుంటుంది. సరిగ్గా అలాగే తెలంగాణలోని బీజేపీ కూడా కేసీఆర్ రాజ్యాంగం అనే కొత్త పదాన్ని కనిపెట్టింది. తెలంగాణ బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ ప్రయోగం చేశారు. తద్వారా టీఆర్ఎస్ కి దొరికిపోయారు. విమర్శించటానికి కూడా కాపీ కొట్టాల్నా అని గులాబీ కేడర్ కమలం పార్టీని ఎద్దేవా చేస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు టీఆర్ఎస్ కి అసలు పోటీయే కాదని అర్థమవుతోంది.