CM KCR: రేపు మళ్లీ హాస్పిటల్ కి రానున్న కేసీఆర్?..

CM KCR తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆసుపత్రికి రానున్నట్లు సమాచారం. ఈ నెల 19న కరోనా వైరస్ సోకటంతో ఆయన ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని తన ఫామ్ హౌజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. హోం ఐసోలేషన్ లో ట్మీట్మెంట్, విశ్రాంతి పొందుతున్న సీఎం కేసీఆర్ ఐదు రోజుల కిందట (ఈ నెల 21న) హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వచ్చి వెళ్లారు. అక్కడ చేయించుకున్న పరీక్షల రిపోర్టులన్నీ నార్మల్ గానే వచ్చాయి. అయితే మళ్లీ ఒకసారి టెస్టులు చేయించుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో రేపు మంగళవారం కూడా అదే హాస్పిటల్ కి వస్తారని చెబుతున్నారు.

తర్వాత.. ప్రగతిభవన్ కి..

ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంకోసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని అది నెగెటివ్ అని వచ్చాక ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని తన అధికారిక నివాసం ప్రగతిభవన్ కి చేరుకుంటారని తెలుస్తోంది. ప్రభుత్వపరమైన రోజువారీ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించిన వెంటనే సీఎం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపైనే మొదటి సమీక్షా సమావేశం జరుపుతారని పేర్కొంటున్నారు. ఎల్లుండు బుధవారం నాడు గానీ లేదా ఆ తర్వాతి రోజు గురువారం నాడు గానీ కొవిడ్-19 పై రివ్వూ మీటింగ్ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు వివరిస్తున్నాయి.

లాక్ డౌన్ పెడతారేమో..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిత్యం భారీ సంఖ్యలో పెరుగుతుండటం వల్ల ఆయా ప్రదేశాలను (హాట్ స్పాట్లను) గుర్తించి అక్కడ కనీసం వారం రోజుల పాటు లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికన్నా ముందు అన్ని శాఖల అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయి పరిస్థితి తీవ్రత గురించి తెలుసుకుంటారు. అవసరమైతే ఏడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టే సూచనలున్నట్లు అంచనా వేస్తున్నారు. కేసులు తగ్గుముఖం పట్టాక ఆంక్షలను సడలిస్తారు. ఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పెట్టాలనుకుంటే మున్సిపల్ ఎన్నికలు (ఈ నెల 30న) ముగిశాక పెట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

Advertisement