CM KCR Announced Contesting From Kamareddy : కేసీఆర్ కామారెడ్డికి వెళ్లడం వెనక కారణం ఏంటి.. ఆ ఇద్దరి వల్లేనా..?
NQ Staff - August 22, 2023 / 12:29 PM IST

CM KCR Announced Contesting From Kamareddy :
కేసీఆర్ రాజకీయ చదరంగాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఎప్పుడు ఎలాంటి వ్యూహం రచిస్తారో ఆలోచించేలోపే ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ కొడుతుంటారు. కేసీఆర్ ఎప్పుడూ అవతలి వారు ఏం వ్యూహం రచిస్తున్నారో దాన్ని బట్టి తాను వ్యూహం రచించాలని ఎప్పుడూ అనుకోరు. తాను గీసిన పద్మవ్యూహంలో ప్రతిపక్షాలు చిక్కుకునేలా చేస్తారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం కూడా ఆయన ఓ వ్యూహాన్ని రెడీ చేసుకున్నారు. నిన్న 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. అందులో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించారు.
అయితే అనూహ్యంగా తాను గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. గజ్వేల్ నుంచి 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు కేసీఆర్. ఇప్పుడు అక్కడ తను ప్రత్యర్థులు కూడా లేరు. ఎందుకంటే తన మీద గత ఎన్నికల్లో పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డిని తన పార్టీలో చేర్చుకుని కీలక పదవి ఇచ్చారు. కాబట్టి తనకు బలమైన ప్రత్యర్థి లేరని ఇన్ని రోజులు గులాబీ శ్రేణులు అనుకున్నారు. కానీ ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి రూపంలో ఇద్దరు బలమైన ప్రత్యర్థులు వచ్చి పడ్డారు. తాను సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానని గతంలోనే ఈటల రాజేందర్ ప్రకటించారు.
ఇటు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మీద పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఇద్దరు బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగితే తనకు గజ్వేల్ లో ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. కాబట్టి గజ్వేల్ లో ఏ మాత్రం అటు ఇటు అయినా సరే ఇంకో నియోజకవర్గం నుంచి తాను గెలిచినట్టు ఉండాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అంతే కాకుండా ఉత్తర తెలంగాణలో బీఆర్ ఎస్ బలహీన పడిందని ప్రతిపక్షలు బాగా ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి ఉత్తర తెలంగాణలో తాను పోటీ చేస్తే ఓటు బ్యాంకు తన పార్టీకి పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.
పైగా కామారెడ్డి భౌగోళికంగా తెలంగాణలో కీలకమైన స్థానంలో ఉంది. నిజామాబాద్ లో బీజేపీ బలం పెరుగుతుందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. కాబట్టి బీజేపీకి చెక్ పెట్టే విధంగా తాను అక్కడి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా తన కూతురు కవితకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఒకవేళ కేసీఆర్ రెండు చోట్ల గెలిస్తే కవితకు కామారెడ్డిని ఇచ్చేసే అవకాశం ఉంది. ఒకవేళ కామారెడ్డిలో మాత్రమే గెలిస్తే కవితను నిజమాబాద్ ఎంపీని చేయడానికి ఉపయోగపడుతుంది..
ఇలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతనే తాను నిజమాబాద్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్. ఇక అక్కడి నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ప్రభుత్వంలో కీలకమైన పదవి ఇస్తామని ఇప్పటికే కేసీఆర్ హామీ ఇచ్చారు. కాబట్టి కామారెడ్డిలో గంప గోవర్ధన్ పోటీలో ఉండరు. కాబట్టి ఈ స్థానం కేసీఆర్ ఫ్యామిలీకే వెళ్లిపోయింది. మరి రానున్న ఎన్నికల్లో కేసీఆర్ మీద గజ్వేల్ లో ఈటల రాజేందర్, రేవంత్ నిజంగానే పోటీ చేస్తారా లేదా అనేది చూడాలి.