Chiranjeevi: రెండు ప‌డ‌వ‌ల‌పై కాళ్లు వేసే ఆలోచ‌న‌లో చిరంజీవి.. సాధ్య‌మేనా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయనతో పని చేయాలని కుర్ర దర్శకులు, సీనియర్ దర్శకులు అందరూ పోటీపడుతున్నారు. ఆయన కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ కూడా ఎవ్వరిని నిరాశ పరచకుండా అందరికీ అవకాశం ఇస్తూ పోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి.

ఇవి ఎప్పుడు విడుదల అవుతాయి అనే విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కరోనా లేకపోయి ఉంటే కచ్చితంగా ఈ పాటికి ఆచార్యతో పాటు లూసిఫర్ రీమేక్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.. వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి. దాంతో అన్ని ఒకేసారి పూర్తి చేయాల్సిన బాధ్యత చిరంజీవిపై పడింది.

ఈ సమయంలో ఏ సినిమాకు ముందు డేట్స్ ఇవ్వాలి.. దేనికి తర్వాత ఇవ్వాలి అనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముందు నుంచి అనుకుంటున్నట్లుగా ఆచార్య సినిమా పూర్తి చేసిన తర్వాత లూసిఫర్ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ మోహన్ రాజా సిద్ధం చేశాడు. చిరంజీవి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కూర్చొని పాటలు రికార్డింగ్ చేసుకుంటున్నాడు రాజా.

ఈ సినిమా తర్వాత వేదాళం రీమేక్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ దానికంటే ముందు బాబీ సినిమాను పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తున్నాడు. అంతేకాదు ఒకేసారి లూసిఫర్ రీమేక్, బాబి సినిమాలు పట్టాలెక్కించాలని చిరు ఆలోచిస్తున్నాడు.

దీనికి తగ్గట్లుగానే డేట్స్ కూడా ఇస్తున్నాడు మెగాస్టార్. సెప్టెంబర్ నుంచి మోహన్ రాజా సినిమాతో బిజీ కానున్నాడు. రెండు నెలల తర్వాత బాబి సినిమా కూడా సెట్స్ పైకి రానుంది. డిసెంబర్ నుంచి ఈ రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయనున్నాడు చిరంజీవి. విడుదల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. 2022 లో కచ్చితంగా రెండు సినిమాలు విడుదల చేయాలి అనేది మెగాస్టార్ ప్లాన్.

కుదిరితే మూడో సినిమా కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. అదే వేదాళం రీమేక్. వచ్చే ఏడాది సమ్మర్ లోపు బాబీ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత మెహర్ రమేష్ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు చిరంజీవి. ఈ ప్లాన్ అనుకున్నట్టు వర్కౌట్ అయితే ఏడాదిన్నరలో చిరంజీవి నుంచి నాలుగు సినిమాలు రానున్నాయి. మరి చూడాలి ఎంత వరకు సక్సెస్ అవుతుందో.