Monkey B Virus: మంకీ బీ వైర‌స్‌తో తొలి మ‌ర‌ణం..!

Monkey B Virus ఒక‌వైపు క‌రోనా వైర‌స్ గుబులు పుట్టిస్తుంటే రోజుకో వైర‌స్ భ‌యాందోళ‌న‌లు క‌లుగ జేస్తుంది. క‌రోనా త‌ర్వాత అనేక వైర‌స్‌లు ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తుండ‌డం మ‌నం వింటూనే ఉన్నాం. తాజాగా క‌రోనా పుట్టిన‌ల్లు చైనాలో మంకీ బీ అనే వైర‌స్ క‌ల‌కలం సృష్టించ‌గా, ఈ వ్యాధి సోకిన వ్య‌క్తి క‌న్నుమూసాడు. ఈ వైర‌స్ సోకిన తొలి వ్య‌క్తి ఇత‌నే కాగా, ఇటీవ‌ల అత‌డు మ‌ర‌ణించిన‌ట్టు ప్ర‌క‌టించారు.

మంకీ బీ వైర‌స్ వ‌ల‌న ప్ర‌స్తుతానికైతే ఎవ‌రికి సోక‌లేదని, చ‌నిపోయిన వ్య‌క్తి సన్నిహితుల‌కు కూడా ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు లేవ‌ని చైనా అధికారిక మీడియా వెల్ల‌డించింది. బీజింగ్‌కు చెందిన ప‌శు వైద్యుడు( 57) కొద్ది రోజులుగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మార్చి నెల‌లో చ‌నిపోయిన రెండు కోతుల శ‌రీరాన్ని ముక్క‌లుగా కోసి ప‌రీక్షించాడు.

ప‌రీక్ష‌లు చేసే క్ర‌మంలో అత‌ను అనారోగ్యానికి గుర‌య్యాడు. ముందు వాంతులు, వికారం వంటి ల‌క్ష‌ణాలు అత‌నిలో క‌నిపించ‌డంతో చికిత్స కోసం వివిధ ఆసుప‌త్రుల‌కు వెళ్లాడు. కొద్ది రోజుల‌లోనే ఆయ‌న ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మే 27న అత‌ను ప్రాణాలు కోల్పోయిన‌ట్టు చైనా అధికారులు స్ప‌ష్టం చేశారు.

చ‌నిపోయిన వ్య‌క్తి న‌మూనా ప‌రీక్షించ‌గా అత‌నికి మంకీ బీ సోకింద‌ని దాని వ‌ల‌నే అత‌డు మ‌ర‌ణించార‌ని వైద్యులు పేర్కొన్నారు. చైనాలో ఇలాంటి కేసులు గ‌తంలో లేవ‌ని వారు అంటున్నారు. అయితే ఈ వైర‌స్‌ని తొలిసారి మ‌కాక్స్ అనే కోతి జాతిలో 1932లోనే గుర్తించారు. కోతుల నుండి నేరుగా , శ‌రీర ద్ర‌వాల ద్వారా ఇత‌రుల‌కు సంక్ర‌మిస్తుంది.

ఈ వైర‌స్ వ‌ల‌న మ‌ర‌ణాల శాతం 70 నుండి 80 వ‌ర‌కు ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. కోతుల సంర‌క్ష‌ణ చూసే వ్య‌క్తులు ఈ వైర‌స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.