బావిలో ప‌డ్డ బాలుడు.. కాపాడ‌బోయి న‌లుగురు దుర్మ‌ర‌ణం

ఆడుకోవ‌డానికి అటుగా వెళ్లిన బాలుడు ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో ప‌డ్డాడు. ఈ విష‌యం తెలిసిన గ్రామ‌స్థులు బాలుడిని ర‌క్షించే ప్ర‌య‌త్నంలో ప్ర‌మాదానికి గుర‌య్యారు.ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని విధిషా జిల్లాలో జ‌రిగింది. విధిషా సమీపంలోని గంజ్ బసోడాలో గురువారం సాయంత్రం ఓ ఎనిమిదేండ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో ప‌డిపోయాడు.

బాలుడిని రక్షించడానికి పలువురు గ్రామస్థులు వచ్చి బావి పైకప్పుపై నిలబడ్డారు. అంతలో బావి పైకప్పు కూలిపోవడంతో 40 మంది బావిలో పడిపోయారు. ఇందులో 19 మందిని స‌హాయ సిబ్బంది ర‌క్షించ‌గా, న‌లుగురి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీసారు. కొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తుంది.

బావి లోతు 50 అడుగులుందని అధికారులు చెప్పారు. జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. గాయ‌ప‌డ్డ వారిని వెంట‌నే ఆసుప‌త్రికి తర‌లించి చికిత్స అందిస్తున్నారు.

తాజా దుర్ఘ‌ట‌న ప‌ట్ల మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. బావిలో పడిన బాధితులకు తక్షణ చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు జరపాలని సీఎం చౌహాన్ అధికారులను కోరారు.

ముందుగా ప‌డ్డ చిన్నారి ఇంకా బావిలోనే ఉన్నదని, ఆమెకు గాయాలయ్యాయా లేదా అనే విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు.