YS Jagan : సంక్రాంతి వేడుక‌లు జ‌రుపుకున్న జ‌గ‌న్.. పంచెక‌ట్టులో మెరిసిన ఏపీ ముఖ్యమంత్రి

YS Jagan : సంక్రాంతి పండుగ‌ను మూడు రోజుల పాటు అంత‌టా ఘ‌నంగా జ‌రుపుకుంటార‌నే సంగ‌తి తెలిసిందే. సినిమా సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఈ వేడుకును అంగ‌రంగ వైభవంగా జ‌రుపుకున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం జగన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Chief Minister of Andhra Pradesh celebrate ys jagan
Chief Minister of Andhra Pradesh celebrate ys jagan

పూర్ణకుంభంతో అర్చకులు సీఎం దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎంజగన్. భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో దంపతులు ఇద్దరు కలసి పాల్గొన్నారు. చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలను చూసిన సీఎం దంపతులు వారిని మెచ్చుకున్నారు.

సంప్రదాయ పంచెకట్టుతో తెలుగుతనం ఉట్టిపడేలా జగన్ వస్త్రధారణ ఉండటం విశేషం. ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా ఎలాంటి సంబరాలు కనిపిస్తాయో అన్నింటిని తాడేపల్లిలోని సీఎం నివాసంలో నిర్వహించారు. భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, గోమాతలకు పూజలు, సంక్రాంతి నృత్యాలు, డప్పు మోతలు, కోలాటాలు, పిండివంటలు… ఇలా సీఎం నివాసంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. ‘అఖండ’ సినిమా విజయంతో ‘అన్‌స్టాపబుల్’ జోష్‌లో ఉన్న సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారంచేడులో భోగి జరుపుకున్నారు. ఆయనతో పాటు కుటుంబమంతా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరితో కలిసి భోగి మంటల వద్ద ముచ్చటించుకుంటున్న ఫొటో వైరల్‌గా మారింది.

ఇక.. వైసీపీ ముఖ్య నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సత్తెనపల్లిలో భోగి మంటల వద్ద లంబాడీ మహిళలతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. ఈ వీడియో కూడా నెట్‌లో వైరల్‌గా మారింది.