పెళ్లి కాని యువ‌కులు ఆమె టార్గెట్‌.. న‌గ‌లు, న‌గ‌దుతో ఉడాయించ‌డంలో స్పెష‌లిస్ట్

ఇప్పుడిది డిజిట‌ల్ యుగం. మోసం చేసే వాళ్లు కూడా నేడు ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టే మోసాలు చేస్తున్నారు. ఆన్‌లైన్ దోపిడి కొంద‌రు చేస్తుంటే, మ‌రికొంద‌రు ఇళ్ల‌ల్లో చొర‌బ‌డి న‌గ‌లు, న‌గ‌దు ఉడాయించుకొని వెళుతున్నారు. ఇక కొంద‌రు మ‌హిళ‌లు అయితే ప్రేమ‌, పెళ్లి అని చెప్పి మోసం చేస్తున్నారు. తాజాగా సుహాసిని అనే మ‌హిళ పెళ్లి కాని యువ‌కుల‌ని టార్గెట్ చేస్తూ న‌గ‌లు, న‌గ‌దుతో ఉడాయిస్తుంది.

చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన సునీల్ కుమార్ తిరుపతిలోని ఓ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసేవాడు. ఆయ‌నకి అక్క‌డే సుహాసిని ప‌రిచ‌య‌మైంది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. పెళ్లి చేసుకుంటాన‌ని సునీల్ కుమార్‌ని ముగ్గులోకి దింపిన ఆమె తాను అనాథ‌న‌ని నువ్వే నా స‌ర్వ‌స్వం అంటూ న‌మ్మించింది. సుహాసిని మాట‌ల‌కు పూర్తిగా ప‌డిపోయిన సునీల్ కుమార్ త‌ల్లిదండ్రుల‌ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి త‌ర్వాత త‌న‌ను పెద్ద చేసిన వారికి అత్య‌వ‌స‌రం అంటూ 6 ల‌క్ష‌లు తీసుకుంది. పెళ్లి స‌మ‌యంలో 10 తులాల బంగారం కూడా తీసుకుంది. కొద్ది రోజుల‌కు డ‌బ్బులు అడ‌గ‌గా మెల్ల‌గా జారుకుంది. దీంతో పోలీసుల‌కి ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు సుహాసిని ఆధార్ కార్డ్ ఆధారంగా విచార‌ణ చేప‌ట్ట‌గా ఆమె నిత్య పెళ్లి కూతురు అని తెలుసుకున్నారు.

గ‌తంలో నెల్లూరుకు చెందిన మేన‌మామ‌తో పెళ్లైంది. ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. అంత‌కుముందు భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వినయ్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాదు భర్త సహకారంతోనే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పెళ్లిళ్లు చేసుకొని కాజేసిన డబ్బు, బంగారం అతడికే ఇస్తున్నట్లు గుర్తించారు.

సునీల్ కంప్లైంట్ ఇచ్చాడ‌ని తెలుసుకున్న సుహాసిని వెంట‌ననే అత‌డికి కాల్ చేసి గ‌తంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయని ఒప్పుకుంది. ఈ విష‌యంతో షాకైన సునీల్ జ‌రిగిన త‌తంగం మీడియాకు వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం సుహాసిని పోలీసుల అదుపులో ఉంది. ఆమెను చిత్తూరు జిల్లా కోర్టుకి త‌ర‌లించాక అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. యువ‌కులు ఇలాంటి యువ‌తుల వ‌ల‌లో ప‌డి మోస‌పోవ‌ద్ద‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.