Chandrababu Naidu: చంద్రబాబు ఊరులో.. చెవిరెడ్డి సెల్ఫ్ సర్వీస్..

Chandrababu Naidu: చంద్రబాబు తెలుగుదేశం. ప్రతిపక్షం. చెవిరెడ్డి వైఎస్సార్సీపీ. అధికార పక్షం. పార్టీలు వేరు. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే. ప్రజలందరూ ఒక్కటే. ఇదే సిద్ధాంతాన్ని రూలింగ్ పార్టీ (చంద్రగిరి) ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి పాటిస్తున్నారు. తమ ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే అని నిరూపిస్తున్నారు. కరోనా మహమ్మారి సోకినవారిని ఆదుకోవటం కోసం ఆయన పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. సొంత ఖర్చులతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని తన నియోజకవర్గం చంద్రగిరి పరిధిలో మొత్తం రూ.25 లక్షల వ్యయంతో ఏకంగా 150 ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధం చేయిస్తున్నట్లు శాసన సభ్యుడు చెవిరెడ్డి తెలిపారు.

కరోనా కేర్ సెంటర్లు..

కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి స్పెషల్ గా కేర్ సెంటర్లు రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రగిరిలో 100 బెడ్లతో ఒక కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 500 పడకలతో చంద్రగిరిలోనే మరో కరోనా మెడికల్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో 50 బెడ్లు ఏర్పాటు చేస్తుండటం విశేషం. ప్రజలకు సత్వర కరోనా సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి దాతృత్వాన్ని నియోజకవర్గ ప్రజలతోపాటు పలువురు అభినందిస్తున్నారు.

3 రోజుల్లో లాక్‌డౌన్..

తిరుపతిలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే షాపులు తెరుచుకునేందుకు ఛాన్స్ కల్పిస్తామని చెవిరెడ్డి పేర్కొన్నారు. 10 గంటల తరువాత ప్రజలు బయట తిరగకుండా ఆంక్షలు అమలు చేస్తామని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 10 వెంటిలేటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ మంగళవారం తిరుపతిలోని తుడా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతిలో కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సిటీ మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement