రైలు ప‌ట్టాల‌పై కారు న‌డిపాడు, ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసా?

బ‌స్సులు, కార్లు, లారీలు రోడ్డుపైన న‌డుస్తాయి. రైళ్లు ప‌ట్టాల‌పై ప్ర‌యాణిస్తాయి. వాటి రూట్స్ మార్చితే ఏం జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓ దొంగ కారుని ఎత్తుకెళ్లి రైల్వే ప‌ట్టాల‌పై నుండి పారిపోదామ‌ని ప్ర‌య‌త్నించాడు. పోలీసుల‌ని సైతం ముప్పు తిప్ప‌లు పెట్టాడు. కాని చివ‌ర‌కు అత‌ను పోలీసుల‌కు చిక్కాడు. యూకేలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

లండన్‌లోని చెషుంట్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులకు ప‌ట్టాల‌పై నుండి కారు వెళుతుండ‌డం క‌నిపించింది. ఇదేంటి రైలు వెళ్లాల్సిన ప‌ట్టాల‌పై కారు పోతుండ‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. కారుని పోలీసులు చేజ్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ మాదిరి జ‌రుగుతుండ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఏం అర్ధం కాలేదు. కొద్ది సేప‌టి త‌ర్వాత దొంగ కారుని దొంగిలించి ప‌ట్టుకెళుతుండ‌గా, పోలీసులు వెంబ‌డిస్తున్నార‌ని తెలుసుకున్నారు.

దొంగ దొంగిలించిన కారు మాములు కారు కూడా కాదు రేంజ్ రోవ‌ర్ కారు. త‌మ కారు పోయింద‌ని కారు య‌జ‌మూని పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌డంతో హెర్ట్‌ఫోర్డ్‌షీర్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరారు. చోరీని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ దొంగ కారును రివర్స్ చేస్తున్నట్లుగా చేసి.. వెంటనే ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటనలో కారును అడ్డుకుని దొంగను అరెస్టు చేయడానికి ప్రయత్నించిన పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. సమీపంలోని పలు కార్లు కూడా ధ్వంసమయ్యాయి.

దొంగ కారుని తీసుకొని ఏకంగా రైల్వే స్టేష‌న్‌లోకి ప్ర‌యాణించాడు. ఏకంగా ట్రాక్‌పైకి కారుని ఎక్కించాడు. అయితే కారు ముందుకు పోక‌పోయేస‌రికి అక్క‌డ వ‌దిలేసి పారిపోసాడు. కాని పోలీసులు చాక‌చ‌క్యంగా అత‌డిని ప‌ట్టుకున్నారు. ఆ స‌మ‌యంలో రైలు రాక‌పోవ‌డంతో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. లేదంటే ప‌రిస్థితి దారుణంగా ఉండేది .

అయితే కారు ట్రాక్‌పైకి వ‌చ్చింద‌ని తెలుసుకున్న రైల్వే అధికారులు వెంట‌నే ఎక్క‌డికక్క‌డ రైళ్లు నిలిపేశారు. కారుని ట్రాక్‌మీద నుండి తొల‌గించాక మ‌ళ్ళీ పునురుద్ధ‌రించారు.అయితే దొంగ ట్రాక్‌పై కారు న‌డుపుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, దీనిని 3 మిలియ‌న్స్‌కి పైగా వీక్షించారు.