Cameron Green : వేలు విరిగి రక్తం కారుతున్నా తగ్గేదే లే..! 17.6 కోట్ల విలువైన క్రికెటర్ సూపర్ ఇన్నింగ్స్.!
NQ Staff - December 28, 2022 / 10:42 PM IST

Cameron Green : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి సంబంధించి ఇటీవల జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా క్రికెటర్ కెమెరూన్ గ్రీన్ రికార్డు మొత్తానికి అమ్ముడు అయిన సంగతి తెలిసిందే. ఏకంగా 17.6 కోట్ల రూపాయలకు ఈ ఆల్ రౌండర్ని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్ జట్టు.
కెమెరూన్ గ్రీన్ ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆ విషయం ఇంకోసారి నిరూపితమయ్యింది. ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కెమెరూన గ్రీన్ అర్థ సెంచరీ సాధించాడు.
అర్థ సెంచరీ ప్రత్యేకత అదే..
177 బంతులు ఆడి అర్థ సెంచరీ చేశాడు కెమెరూన్ గ్రీన్. అర్థ సెంచరీ సాధిస్తే వింతేంటని అనుకుంటున్నారా.? అదే మరి అసలు మ్యాజిక్. రెండో రోజు మ్యాచ్ సందర్భంగా కెమెరూన్ గ్రీన్ గాయపడ్డాడు. చేతి వేలు విరిగింది. రక్తం ధారలా కారింది. దాంతో, రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
అయితే, అనూహ్యంగా మూడో రోజు బరిలోకి దిగాడు. గాయంతోనే ఆడాడు.. సత్తా చాటాడు. టీ20ల్లో మెరుపు బ్యాటింగ్ చేసే కెమెరూన్ గ్రీన్, జట్టు ప్రయోజనాల రీత్యా.. బాధను భరిస్తూనే, అవసరమైనంత నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం గమనార్హం.