Cake: వేలానికి కేకు ముక్క‌.. ధ‌ర తెలిస్తే అవాక్క‌వ‌డం ఖాయం

Cake: పురాత‌న క‌ట్ట‌డాలు, ఆ కాలం నాటి వ‌స్తువులు ఎంతో ఆకర్షణీయంగా మారుతుంటాయి. పాత కాలం వ‌స్తువులు కొనేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతుంటారు. అప్ప‌టి వ‌స్తువుల‌ను వంద‌లు వేల‌కి కాదు కోట్ల‌లో వేలం వేస్తుంటారు. అయితే కొనే వారు ఉన్నారు కాబ‌ట్టే ఆ రేంజ్‌లో వేలం వేస్తున్నారు.ఆ మ‌ధ్య పాత కాలం నాటి కాయిన్‌ని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు.ఇక తాజాగా 40 ఏళ్ల క్రితం నాటి ఓ కేకు ముక్క వేలానికి రాబోతుంది. దానిని కొనేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారట‌.

ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్ వివాహ సందర్భంగా అనగా 1981 కాలంలో తయారు చేసిన కేక్‌ ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. వీరి వివాహం సంద‌ర్భంగా వ‌చ్చిన కేకుల్లోని ఓ దాని ముక్క‌ను త్వ‌ర‌లో వేలం వేయ‌బోతున్నార‌ట‌. దీనిపై జూలై 29, 1981 అని రాసి ఉంది. మార్జిపాన్ బేస్, షుగర్ ఆన్‌లే కోట్-ఆఫ్-ఆర్మ్స్, పైన బంగారం, ఎరుపు, నీలం వెండి రంగులతో అలంకరించబడి ఉంది. ఈ కేక్‌ ముక్కను క్లారెన్స్ హౌస్‌లోని రాణి తల్లిగారి ఇంటి సభ్యురాలైన మొయిరా స్మిత్‌కు ఇవ్వబడింది.

పూల కేక్ టిన్‌లో చాలా ప‌క‌డ్బందీగా భ‌ద్ర‌ప‌ర‌చ‌గా, ఈ టిన్ మూత మీద చేతితో త‌యారు చేసిన లేబుల్ అంటించి ఉంది. ‘చాలా జాగ్రత్తగా పట్టుకొండి.. ఇది ప్రిన్స్‌ చార్లెస్‌-ప్రిన్సెస్‌ డయానాల వివాహ కేక్‌’ అని ఉంది. అలానే 24-07-81 అని డేట్‌ వేసి ఉంది. 2008లో ఈ కేక్‌ని స్మిత్ కుటుంబ స‌భ్యులు ఓ వ్య‌క్తికి అమ్మారు. 2011 ఆగ‌స్ట్‌లో మ‌రోసారి వేలానికి వేసారు. ఇప్పుడు మ‌రోసారి ఈ కేక్ వేలానికి రాబోతుంది.

రానున్న రోజుల‌లో జరగబోయే వేలంలో ఈ కేక్‌ ముక్క 300-500 పౌండ్ల (31,027,51,712) ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఈ కేక్‌ ముక్క వేలం పాట సదర్భంగా సర్వీస్ ఆర్డర్, వేడుక వివరాలు, ఒక రాయల్ వెడ్డింగ్ అల్పాహార కార్యక్రమం నిర్వహించనున్నారు.

డోమినిక్‌ వింటర్‌ ఔక్షనీర్స్‌ సీనియర్‌ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘వాస్తవంగా ఈ కేక్‌ ముక్కను అమ్మినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉంది. అయితే పొరపాటున కూడా దీన్ని తినకూడదు అని హెచ్చరిస్తున్నాం’’ అని తెలిపారు. తిన‌డానికి వీలు లేని కేక్‌ని అంత భారీ ధ‌ర‌తో కొనుగోలు చేసుకోవ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.