BRS : శంకరమ్మకి ఎమ్మెల్సీ.. ఇన్నేళ్లకి అమరవీరుడి తల్లికి గౌరవం
NQ Staff - June 21, 2023 / 09:53 PM IST

BRS : తెలంగాణ సీఎం కేసీఆర్ మరో వ్యూహాత్మక ఎత్తుగడ వేసి ఎన్నికల ముందు అందరి దృష్టిని ఆకర్షించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అమరవీరులను పట్టించుకోవడం లేదు అంటూ వస్తున్న విమర్శలకు ఈ ఒక్క పనితో సమాధానం చెప్పినట్లు అయ్యింది. శంకరమ్మను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసేందుకు రంగం సిద్దం అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడటానికి కారణం శ్రీకాంత చారి ఆత్మబలిదానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి గొప్ప త్యాగ నిరతిని కనబర్చిన శ్రీకాంత చారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. గత ఎన్నికల సమయంలో శ్రీకాంత చారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం జరిగింది.
2014 ఎన్నికల్లో శంకరమ్మకు హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం కేటాయించడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆమెకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు రెడీ అయ్యారు అంటూ సమాచారం అందుతోంది.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా గవర్నర్ వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో అమరవీరుడు కాసోజు శ్రీకాంత చారి యొక్క తల్లికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తే తప్పకుండా అంగీకరించాల్సిందే. కనుక ఒకే సారి ప్రజల్లో మంచి పేరు మరియు గవర్నర్ నుండి వ్యతిరేకత లేకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.