BRS Party : దేశంలో చైతన్యం తీసుకు రాబోతున్న బీఆర్‌ఎస్ : కేసీఆర్‌

NQ Staff - January 19, 2023 / 09:26 AM IST

BRS Party : దేశంలో చైతన్యం తీసుకు రాబోతున్న బీఆర్‌ఎస్ : కేసీఆర్‌

BRS Party : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మం వేదికగా భారీ ఎత్తున జరిగింది. తెలంగాణ నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. ముఖ్యమంత్రులు విపక్ష నేతలు పలు రాష్ట్రాల కీలక నాయకులు ఈ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ భారత్ అన్ని విధాలుగా సుసంపన్నమైన దేశం. జల వనరుల విషయంలో మన దేశమే అగ్రగామి. కానీ బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం ఇంకా కూడా అర్రులు చాచుతోంది.

చైనాలో 5000 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉంది. మన దేశంలో అతి పెద్దదైన ఒక్క రిజర్వాయర్ ఉందా అంటూ కేసిఆర్ ప్రశ్నించారు. దేశానికి ఇప్పటికి కూడా ఒక నిర్దిష్ట లక్ష్యం అనేది లేకుండా పోయింది. ఈ దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్ 4.10 లక్షల మెగావాట్లు. దేశం ఎప్పుడూ కూడా 2.10 లక్షల మెగావాట్ల ను మించి వాడలేదని కేసీఆర్ పేర్కొన్నారు.

దళిత బంధును దేశ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్‌ఎస్ పార్టీ లేదా మా యొక్క కూటమి అధికారంలోకి వస్తే ఏటా దేశంలోని 25 లక్షల కుటుంబాల చొప్పున దళిత బంధు అమలు చేస్తామని హామీ ఇస్తున్నాం. దేశంలో బీఆర్‌ఎస్ పార్టీ తో రాజకీయ చైతన్యం తీసుకు రాబోతున్నట్లుగా కేసీఆర్‌ ప్రకటించారు.

ఎల్ఐసి ని అడ్డికి పావుషేరు చొప్పున అమ్మేందుకు సిద్ధం అయ్యారు. విద్యుత్ ను ప్రభుత్వ రంగంలోనే ఉంచేలా తాము చర్యలు తీసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీది ప్రైవేటీకరణ విధానం అయితే మాది జాతీయికరణ విధానం అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

ఇక ముందు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లుగా కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ యొక్క వ్యూహం, విధానం అన్ని కూడా త్వరలో మరింత స్పష్టంగా తెలియజేస్తానంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని తక్కువ సమయానికి ముగించారు. సభ భారీ సక్సెస్ అయ్యిందని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బహిరంగ సభకు హాజరు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరియు పంజాబ్‌ ముఖ్యమంత్రి లు కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రత్యర్థులను కలిసి కట్టుగా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామంటూ కేరళ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్‌ కు మద్దతుగా నిలుస్తామని కలిసి ముందుకు సాగుతామని పేర్కొన్నాడు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us