BRS: బీఆర్‌ఎస్ బహిరంగ సభకు జనాలను తీసుకు వస్తే సర్పంచ్ కి రూ.10 లక్షలు.. మంత్రి బహిరంగ ఆఫర్
NQ Staff - January 18, 2023 / 03:24 PM IST

BRS : నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభను వేదికగా చేసుకోబోతున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు మాజీ ముఖ్యమంత్రి ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బహిరంగ సభను తీసుకొని ఏర్పాట్లను పర్యవేక్షించిన విషయం తెలిసిందే. ఇక మంత్రులు జన సమీకరణ కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 18న జరగబోయే బీఆర్ఎస్ బహిరంగ సభకు పంచాయతీల నుండి పెద్ద ఎత్తున జనాలను తరలించాలని సర్పంచులకు ఆదేశాలు జారీ చేశారు.
చిన్న పంచాయతీల నుండి 300 మందిని పెద్ద పంచాయతీల నుండి 600 మందిని మినిమంగా తరలించాలని.. అలా తరలిస్తే గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయల చొప్పున తన శాఖ నుండి నిధులు కేటాయిస్తానంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు.
భారత రాజకీయాల్లో బీఆర్ఎస్ కచ్చితంగా ప్రభావం చూపబోతుందని.. ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ కలలు కన్న ప్రభుత్వాన్ని, ఫలాలను అందిస్తారని మంత్రి జోష్యం చెప్పారు. అయితే సర్పంచులకు 10 లక్షల రూపాయల బహిరంగ ఆఫర్ చేయడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.