Salman Khan: మ‌రో టాలీవుడ్ రీమేక్.. తెలుగు సినిమాల‌పై ఫోక‌స్ పెడుతున్న‌ బాలీవుడ్ స్టార్స్‌

Salman Khan: టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ స్థాయి పెర‌గ‌డంతో మ‌న సినిమాల‌న్ని హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఇప్ప‌టికే చాలా సూప‌ర్ హిట్ చిత్రాలు హిందీలో రీమేక్ కాగా, ఇప్పుడు మ‌రో రీమేక్ చేసేందుకు సల్మాన్ సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కు రీమేక్ స్పెషలిస్ట్ అని పేరు ఉంది. కొన్ని సంవత్సరాలుగా కేవలం సౌత్ సినిమాలపై ఆధారపడి కెరీర్ లాగిస్తున్నాడు సల్మాన్ ఖాన్.

నిజం చెప్పాలంటే పూర్తిగా పాతాళంలో ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ కెరీర్ కు ఊపిరిలూదిన సినిమా పోకిరి రీమేక్ వాంటెడ్. ఈ సినిమాతో మళ్ళీ తానేంటో నిరూపించుకున్నాడు సల్మాన్ ఖాన్. అప్పటివరకు మూతపడి ఉన్న సింగిల్ స్క్రీన్స్ సల్మాన్ మాస్ హిస్టీరియాకు తెరుచుకున్నాయి. ఇక ఆ తర్వాత వరుసగా రెడీ, కిక్, స్టాలిన్ ఇలా చాలా సినిమాలు రీమేక్ చేశాడు. అందులో చాలా వరకు విజయం సాధించాయి కూడా.

Salman Khan
Salman Khan

ఇదిలా ఉంటే తాజాగా మరో బ్లాక్ బస్టర్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కు చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన నికార్సయిన విజయం జనతా గ్యారేజ్. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా 2016 లో విడుదలైంది. దాదాపు 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అద్భుతమైన విజయం సాధించింది.

ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందులో సల్మాన్ ఖాన్ అయితే బాగుంటాడని.. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. సల్మాన్ కూడా జనతా గ్యారేజ్ కథకు కనెక్ట్ అయ్యాడు. మోహన్ లాల్ పోషించిన పాత్రను హిందీలో సంజయ్ దత్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ మధ్య మంచి స్నేహం ఉంది. ఈ కారణంగానే ఇద్దరు కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తన సొంత నిర్మాణంలోనే జనతా గ్యారేజ్ రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ఏదేమైనా కూడా తెలుగు సినిమాలను నమ్ముకున్న ప్రతిసారి సల్మాన్ విజయం అందుకున్నాడు. ఒకటి రెండుసార్లు మాత్రమే అంచనాలు తప్పాయి. మరి ఇప్పుడు జనతా గ్యారేజ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.