Ramiz Raja: భారత్‌పై పాక్ విజయం సాధిస్తే పాకిస్థాన్‌ ఆట‌గాళ్ల‌కు బ్లాంక్ చెక్.. ర‌మీజ్ రాజా కామెంట్స్

Ramiz Raja: భార‌త్ – పాక్ మ‌ధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత సంద‌డి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సెల‌వులు పెట్టి మ‌రీ మ్యాచ్‌ల‌ని చూసేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. పాక్‌తో స‌రైన సంబంధాలు లేని కార‌ణంగా భార‌త్ కేవ‌లం వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌లోనే ఆ టీంతో త‌ల‌ప‌డుతుంది. అక్టోబ‌ర్ 17 నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్ర‌పంచ క‌ప్ జర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ నెల 24న భారత్‌-పాక్ జ‌ట్లు ఎదురుపడనున్నాయి.

అక్టోబరు 24న జరిగే మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధిస్తే పాకిస్థాన్‌ ఆట‌గాళ్ల‌కు బ్లాంక్ చెక్కు ఇస్తామ‌ని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మ‌న్ ర‌మీజ్ రాజా సంచలన ప్రకటన చేశారు. బ్లాంక్‌ చెక్‌ ఇవ్వడానికి ఓ బలమైన ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంటర్ ప్రావిన్షియల్ కో-ఆర్డినేషన్‌పై వేసిన సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు రమీజ్ రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు.పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి 50శాతం నిధులు వస్తున్నాయని వివరించారు.

ఐసీసీకి సుమారు 90 శాతం నిధులు ఒక్క భారత్ నుంచే వస్తుంటాయని పేర్కొన్నారు. ఒకరకంగా చెప్పాలంటే భారత్‌లోని వ్యాపార సంస్థలే పాకిస్థాన్‌ క్రికెట్‌ను నడిపిస్తున్నాయని వివరించారు. ఐసీసీకి బీసీసీఐ నుంచి నిధులు సమకూరకుంటే పాక్‌ క్రికెట్ బోర్డు కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ క్రికెట్‌ను పటిష్టంగా తీర్చిదిద్దడానికి నేను నిశ్చయించుకున్నాను, అయితే ఓ పెద్ద ఇన్వెస్టర్ ఒక‌వేళ ఇండియాను వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో ఓడిస్తే, పాక్ జ‌ట్టుకు బ్లాంక్ చెక్ ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్లుగా వెల్లడించాడు. దాని మీద ఎంత మొత్తమైనా రాసుకోవచ్చని అతను తనకు ఆఫర్ ఇచ్చినట్లు రమీజ్ రాజా తెలిపారు. అయితే ఆ పెట్టబడిదారుడి పేరును వెల్లడించడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు.

ఇటీవల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తమ దేశ పర్యటనను రద్దు చేసుకోవడంతో రమీజ్ రాజా ఆగ్రహంతో ఉన్నారు. పాక్ క్రికెట్ బోర్డు.. బీసీసీఐలా ఆర్థికంగా బలంగా ఉంటే.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇంతటి సాహసం చేసి ఉండేవి కాదని స్పష్టం చేశారు.