BL Santhosh : ఎవరీ బీఎల్ సంతోష్.! కేసీయార్ సర్కార్ ఎందుకు టార్గెట్ చేసింది.?

NQ Staff - November 24, 2022 / 11:12 AM IST

BL Santhosh : ఎవరీ బీఎల్ సంతోష్.! కేసీయార్ సర్కార్ ఎందుకు టార్గెట్ చేసింది.?

BL Santhosh : బీఎల్ సంతోష్.. ఈ పేరిప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మార్మోగిపోతోంది. ‘ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా.?’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కంటతడి పెట్టారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధానంగా వినిపిస్తోన్న పేరు బీఎల్ సంతోష్. ఆయనే, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాన్ని తెరవెనుకాల వుండి నడిపారన్నది ప్రధాన ఆరోపణ.!

ఇంతకీ, ఎవరీ బీఎల్ సంతోష్.? బీజేపీలో ఆయన పాత్ర ఏంటి.? ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం, ముందస్తు అపాయింట్మెంట్ తీసుకుంటేనే బీఎల్ సంతోష్‌ని కలవడానికి వీలవుతుందా.? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా బీఎల్ సంతోష్ పేరు ఇంతల మార్మోగిపోవడానికి కారణాలేంటి.? మోడీ కంటే, అమిత్ షా కంటే బలవంతుడా ఈ బీఎల్ సంతోష్.?

ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుండి..

బీఎల్ సంతోష్ వయసు దాదాపు 55 ఏళ్ళు. కర్నాటకకు చెందినవారీయన. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ప్రస్థానం మొదలు పెట్టారు.. బీజేపీలో అంచలంచెలుగా ఎదిగారు. 2006లో కర్నాటక బీజేపీ జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించారు. 2014 వరకూ ఈ పదవిలో వున్నారాయన.

2014లో జాయింట్ జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టి, 2019లో జనరల్ సెక్రెటరీగా మారారు. ప్రధానంగా యువతను పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేరడం.. వంటి కీలక బాధ్యతల్ని ఆయన నిర్వహించారు. ప్రతాప్ సింహా, తేజస్వి సూర్య వంటి యువ నాయకులు ఎదగడానికి బీఎల్ సంతోష్ కారణంగా చెబుతారు.

కర్నాటక బీజేపీలో ఏ మార్పులు జరగాలన్నా, బీఎల్ సంతోష్ కనుసన్నల్లోనే జరిగేవనీ, కర్నాటక పార్టీకీ, జాతీయ నాయకత్వానికీ మధ్య వారధిలా ఆయన పనిచేశారని అంటారు.

వివాదాలూ తక్కువేం కాదు.!

వాల్మీకీలు, బోయలు, వడ్డార్లు ఇతర దళితుల్ని వలసదారులుగా ఆయన అభివర్ణించి వార్తల్లోకెక్కారు. ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరానా నింపేసుకున్న బీఎల్ సంతోష్, బీజేపీ – ఆర్ఎస్ఎస్ మధ్య ప్రధాన అనుసంధాన కర్తగా కూడా వ్యవహరిస్తున్నారు.

BL Santosh Strategies Are Reason For BJP Growth

BL Santhosh Strategies Are Reason For BJP Growth

చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు బీఎల్ సంతోష్ రచించిన వ్యూహాలే కారణమని బీజేపీ పెద్దలూ భావిస్తుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు బీఎల్ సంతోష్ హవా కనిపిస్తోంది. ఆయితే, ఆయన పబ్లిసిటీకి దూరంగా వుంటారు. తెరవెనుకే వుండి రాజకీయాలు నడుపుతారు. ప్రభుత్వాల్ని పడగొట్టడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శా లేకపోలేదు.

తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీఎల్ సంతోష్, ఎమ్మెల్యేల కొనుగోళ్ళకు ఎర వ్యవహారంలో కీలక సూత్రధారి అని తెలంగాణ రాష్ట్ర సమితి అనుమానిస్తోంది. ఆయన్ని ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. అయితే, బీఎల్ సంతోష్ ఇంతవరకు ఈ కేసులో విచారణకు హాజరు కాలేదు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us