BJP: గెలవకపోతే.. టీకాని ఫ్రీగా ఇవ్వరా?..

BJP ‘‘పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ కొవిడ్-19 టీకాని ఉచితంగా వేస్తాం’’ అంటూ బెంగాల్ బీజేపీ ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోతే జనాన్ని పట్టించుకోరా, ఓట్ల కోసమే ఇలా గిమ్మిక్కులు చేస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లెటర్ రాశారు. దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయాలని కోరారు.

ప్రజల కోసం ఆలోచించండి..

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీల కోసమో, మార్కెట్ల ప్రయోజనాల కోసమో ఆలోచించకూడదని, ప్రజల కోసం పాటుపడాలని మమతా బెనర్జీ కాషాయం పార్టీకి హితవు పలికారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి సమయ సందర్భాల్లో టీకా ఉత్పత్తిదారుల గురించి కాకుండా పబ్లిక్ గురించి ఆలోచన చేయాలని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు. బెంగాల్ బీజేపీ ఇవాళ ట్విట్టర్ లో పెట్టిన ఈ పోస్టు ఆ పార్టీపై పొలిటికల్ గా కాస్త నెగెటివ్ ఎఫెక్టే చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ రాష్ట్రాల్లో ఉచితం..

ప్రస్తుతం 45 ఏళ్ల వయసు నిండినవారికి మాత్రమే టీకా వేస్తుండగా మే నెల ఒకటి నుంచి 18 ఏళ్లు పూర్తైన ప్రతిఒక్కరూ కొవిడ్-19 టీకా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే ఇది ఉచితంగా అందించబోమని, కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీగా ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసోం, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కార్లు ఉచితంగా తమ ప్రజలకు వ్యాక్సిన్ ఇప్పించేందుకు ముందుకు వచ్చాయి. దీంతో పశ్చిమ బెంగాల్ లో సైతం ఫ్రీగానే టీకా వేయిస్తామని కమలనాథులు చెప్పి ఉంటే బాగుండేది. దీన్ని ఎన్నికల ఫలితంతో ముడిపెట్టకుండా ప్రకటిస్తే ప్లస్ అయ్యేది. నాలుగు ఓట్లు ఎక్కువ పడేవి. తొందరపాటుకి చింతిస్తోంది.

Advertisement