BJP vs TRS: ‘మీరే డిసైడ్ చేసుకోండి’ అంటున్న మంత్రి హరీష్ రావు

BJP vs TRS: మున్సిపల్ ఎన్నికల సమరంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి, బీజేపీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఎలక్షన్ నుంచే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు రాజకీయ పతనం ప్రారంభం కావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. దీనికి కౌంటర్ గా హరీష్ రావు ‘‘ఓట్ల కోసం వచ్చేవాళ్లు కావాలా? లేక అవసరంలో ఉన్నప్పుడు ఆదుకునేవాళ్లు కావాలా? మీరే డిసైడ్ చేసుకోండి’’ అని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు దోచుకుంటున్నారని తరుణ్ చుగ్ ఆరోపించగా ఒకప్పుడు సిద్దిపేటలో నీళ్ల గోసను చూసి పిల్లను ఇవ్వాలంటే ఆలోచించేవారని, అలాంటి ప్రాంతాన్నిఇప్పుడు అభివృద్ధికి ప్రసిద్ధిగా మార్చామని హరీష్ రావు బదులిచ్చారు.

 

వాళ్లకు మాత్రమే ఇళ్లు

టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్లకు మాత్రమే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తోందని బీజేపీ బాధ్యుడు తరుణ్ చుగ్ విమర్శించారు. అయితే.. రాష్ట్రంలో ఇళ్లు లేనివాళ్లే ఉండకూడదని, మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏయే సదుపాయాలు కావాలో అవన్నీ కల్పిస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాలికి మట్టి అంటని విధంగా నీట్ గా రోడ్లు వేశామని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, కేసీఆర్ ఫ్యామిలీ గవర్నెన్స్ నడుస్తోందని, ప్రశ్నించే గొంతుకలను మూయిస్తున్నారని కమలనాథుడు మండిపడగా దీనికి హరీష్ రావు పగటి వేషగాళ్లను నమ్మి మోసపోవద్దని, టీఆర్ఎస్ పార్టీకి తప్ప డూప్లికేట్ గాళ్లకు ఓట్లు వేయొద్దని ప్రజలకు మనవి చేశారు.

కోట్లకు కోట్లు..

తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు సైకిల్ మీద తిరిగిన నాయకులు ఇప్పుడు కేసీఆర్ పాలనలో కోట్ల రూపాయలకు పడగలెత్తారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఎద్దేవా చేయగా తెలంగాణ మూలాల్లేని ఆ కాషాయం పార్టీ నాయకుడు చేసిన ఈ కామెంట్ కి రాష్ట్ర మంత్రి హరీష్ రావు అద్దిరిపోయే బదులిచ్చారు. దేశం మొత్తం కరోనాతో సతమతమవుతుంటే మోడీ సర్కారు ఒక్క గుజరాత్ పైనే ఫోకస్ పెట్టిందని తప్పుపట్టారు. ఆ రాష్ట్రానికి 1.63 లక్షల వ్యాక్సిన్లను పంపించగా తెలంగాణకి కేవలం 21 వేల టీకాలే ఇచ్చారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో తయారవుతున్న కొవిడ్-19 వ్యాక్సిన్ పై కేంద్రం పెత్తనమేంటని నిలదీశారు.

Advertisement